ప్రకాశంలో జిల్లాలో విపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో అనూహ్య పరిణామాలకు.. ఉద్రిక్తలకు కారణమైంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. 150-200 మధ్యన పార్టీ కార్యకర్తల్ని వెంట పెట్టుకొని తన క్యాంప్ కార్యాలయం ముందు నిలిచి.. ‘దళిత ద్రోహి బాబు గో బ్యాక్’ అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
చంద్రబాబు పర్యటనను తాము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరతామంటూ ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నుంచే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. ఆయన టూర్ ను అడ్డుకునేందుకు తరలి రావాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మంత్రి.. అందుకు తగ్గట్లే కార్యక్రమాన్ని చేపట్టారు. తన క్యాంప్ ఆఫీసు ముందు రోడ్డు మీద నిలుచున్న ఆయన.. తన వారితో కలిసి నల్ల చొక్కా ధరించి.. ఫ్లకార్డులు.. నల్ల బెలూన్లను సిద్ధం చేశారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల్లో ఒకరు.. ‘చంద్రబాబుతో వస్తున్న టీడీపీ శ్రేణులు మిమ్మల్ని అడ్డుకుంటే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి ఆదిమూలపు తాను ధరించిన బ్లాక్ టీ షర్టులను ఒంటి మీద నుంచి తీసేసి.. అర్థనగ్నంగా మారి.. ‘‘దమ్ముంటే ఎవరైనా రండి’’ అంటూ తీవ్ర ఆవేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఒక రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తూ.. ఇలా రోడ్డు మీద నిలబడి.. విపక్ష నేత పర్యటనను అడ్డుకోవాలనుకోవటం.. ఇందులో భాగంగా నిరసన తెలపటమే కాదు.. తన చొక్కా విప్పేసి మరీ.. తీవ్ర ఆగ్రహంతో, ఆవేశాన్ని ప్రదర్శిస్తూ సవాలు విసిరిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి తీరును ప్రదర్శించటమా? అన్న వాదన ఒకవైపు.. మొత్తానికి విపక్ష నేత పర్యటనను కొత్త తరహాలో అడ్డుకోవటం ద్వారా.. మంత్రి ఆదిమూలపు సురేశ్ సరికొత్త సంప్రదాయానికి తెర తీశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రే స్వయంగా రోడ్డు మీదకు వచ్చేసి.. ఇలా చొక్కా విప్పేసే తీరును మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
సాధారణంగా ఎవరైనా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు.. వారిని అడ్డుకొని.. ముందుగా అనుమతి పొందిన కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చేసే పోలీసులు.. తాజా ఎపిసోడ్ లో వ్యవహరించిన వైఖరిపై విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పర్యటనను ఇంత హడావుడి చేసి అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇలా చేయటం ద్వారా విపక్ష నేతకు మరింత ప్రచారం కల్పించినట్లు అవుతుంది కదా? ఆ చిన్న లాజిక్ మంత్రి ఎందుకు మిస్ అయినట్లు?