ఒక వివాదాన్ని ఎక్కడ ముగించాలన్న విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలకు అర్థంకానట్లుగా కనిపిస్తోంది. తమ వాదనకు భిన్నమైన తీర్పులు వస్తున్నప్పుడు కాస్తంత తగ్గి.. మరో విషయం మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ఈ చిన్న విషయాన్ని వదిలేసి.. అదే పనిగా ప్రతి విషయం మీద చర్చకు వెళ్లటం సరికాదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించాలని ఎన్నికల కమిషన్.. కాదని ప్రభుత్వం అనుకోవటం.. కోర్టులను ఆశ్రయించటం తెలిసిందే. చివరకు సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల్ని నిర్వహించాలని చప్పిన తర్వాత.. ఏపీ ప్రభుత్వం ఎన్నికల మీదా.. గెలుపు మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. అంతేతప్పించి.. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ పీకుడు లాగుడు తీరును ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ప్రతికాప్రకటన చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందిస్తూ.. ఏకగ్రీవాలపై ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని.. అందులో రాజకీయం ఏముందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ఏవైనా సరే..ఒకసారి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. రూల్ బుక్ ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా తీసుకునే నిర్ణయాలు వివాదాలుగా మారితే.. వాటిని ఎక్కడికక్కడ తుంచేయాలే తప్పించి పెంచుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజానికి తమవాదనను సమర్థవంతంగా వినిపించేందుకు ఆరాటపడుతున్న ఏపీ అధికారపక్ష నేతలు.. పంచాయితీ ఎన్నికల్లో తమ పార్టీ సానుభూతిపరులుగా రంగంలోకి దిగే వారి గెలుపు మీద ఎక్కువగా ఫోకస్ పెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెక్నికల్ అంశాల జోలికి వెళ్లే కొద్దీ.. సమస్యలు పెరగటం.. ఎదురుదెబ్బలు తగలటం వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతామన్న విషయాన్ని రాజకీయాల్లో సీనియర్ అయిన మంత్రి పెద్దిరెడ్డి గుర్తిస్తే మంచిది. లేనిపక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్నిమర్చిపోకూడదు.