పరదాల ముఖ్యమంత్రి….ఈ పేరు చెప్పగానే ఏపీ మాజీ సీఎం జగన్ గుర్తుకు వస్తారు. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆ రూట్లలో బారికేడ్లు పెట్టడం వంటివి ఆనవాయితీ. కానీ, జగన్ హయాంలో మాత్రం ఆయన వెళ్లే దారిలో చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టడం వంటి వింతపోకడలు కనిపించాయి. ఆ వ్యవహారంపై ఇటు ప్రతిపక్షాలు, అటు మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన భద్రతా ఏర్పాట్లలో అధికారులు అలవాటు ప్రకారం పరదాలు కట్టారు. తీసుకున్నారు. ఈ క్రమంలోనే తన పర్యటనలో పరదాలు కట్టి, అనవసర ఆంక్షలు పెట్టొద్దని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. పాత పద్ధతులను వీడాలని, సీఎంను ప్రజలకు దూరం చేసే చర్యలు చేపట్టొద్దని, తాను మూమూలు ముఖ్యమంత్రిని అని చెప్పారు. దీంతో, అధికారులు పరదాలు తొలగించారు.
ఇక, ఇదే పర్యటనలో భాగంగా తిరుమలలో అతిథి గృహం వద్ద పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ‘ఏం ఇంకా పోలీసులు పరదాలు కట్టారు. అలవాటైపోయింది వాళ్లకి. కట్టొద్దంటే కడుతున్నారు. చచ్చిపోతున్నాం చెప్పలేక…ముందు ఈ అలవాటు మార్చాలి. అంతా సెట్ కావాలి. ఫ్లై ఓవర్పై మొదటిసారి పోలీసులను చూశాను’ అంటూ నారా లోకేశ్ సెటైర్లు వేశారు. అలవాటులో పొరపాటైందని, ఇకపై ఆ అలవాటు మార్చుకుంటామని అధికారులు అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.