స్వాతంత్ర ఉద్యమంలో ఉత్తరాంధ్రను ముందుకు నడిపించిన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పలాసలో భూ ఆక్రమణల తొలగింపు, గౌతు లచ్చన్న విగ్రహంతోనే ప్రారంభిస్తున్నామని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలతో గౌతు శిరీష మండిపడ్డారు. సర్దార్ గౌతు లచ్చన్నపై మంత్రి సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని, వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రిగా జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అప్పలరాజు ఇలా అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని టీడీపీ నేతలు విమర్శించారు. అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళంలో టీడీపీ నేతలు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీషలు నిరసన తెలుపుతుండగా వారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టులను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. విగ్రహం కూలుస్తానన్న వైసీపీ మంత్రులు, నేతలను వదిలి, టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని చంద్రబాబు దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు అని, పౌరుల హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారన్నారని మండిపడ్డారు. సర్దార్ గౌతు లచ్చన్న గారిని అవమానించిన వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మరోవైపు, గౌతు శిరీషతో ఓ లైవ్ డిబేట్ లో పాల్గొన్న సీదిరి అప్పలరాజు అడ్డంగా బుక్కయ్యారు. గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణకు తాను వెళ్లలేదని శిరీష చెప్పారు. అయితే, లచ్చన్న శిలాఫలకంపై శిరీష పేరుందని అప్పలరాజు వాదించారు. వైసీపీ నేతల పేర్లు కూడా అనేక శిలాఫలకాల పేర్లున్నాయని, ఆ కార్యక్రమాలన్నిటికీ వారు వెళ్లారా అని శిరీష ప్రశ్నించడంతో అప్పలరాజు నోట మాట రాక అడ్డంగా బుక్కయ్యారు. అంతటితో ఊరుకోని అప్పలరాజు…లచ్చన్న అంటే తమకు అభిమానమని చెప్పే ప్రయత్నంలో మరోసారి బుక్కయ్యారు. సర్దార్ గౌతు లచ్చన్నని జాతీయ నాయకుడిగా చూస్తున్నామన్న అప్పలరాజు…లచ్చన్న విగ్రహం ఉన్న భూమి అక్రమమే అయినా, దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేకంగా అనుమతులు ఇప్పించి, ఆ భూమిని రెగ్యులరైజ్ చేసి.. అచ్చన్న విగ్రహానికి గౌరవం తెస్తామంటూ వ్యాఖ్యానించారు. విగ్రహానికి గౌరవం తెస్తానన్న అప్పలరాజు అసలు తొలగిస్తామన్న మాట ఎందుకు అన్నారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీంతో, అప్పలరాజు అనవసరంగా ఈ వివాదాన్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలతో అధికార పార్టీ డొల్లతనం పూర్తిగా బట్టబయలైపోయిందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.