మట్టి పొరల్లో దాగి ఉన్న దేశ భక్తి గొప్పది అని అంటారు ఓ కవి.. తాత్వికత నిండిన వాక్యాలు వకీలు కవిత్వంలో ఉండవు కదా ! ఆ విధంగా చైతన్యం నిండిన సందర్భాలు గొప్ప సందేశాన్ని అందిస్తాయి. ఆచరణాత్మకం అయి ఉంటాయి కూడా !
నేను వంతు సహకారం ఈ దేశానికి ఇస్తాను.. ఈ దేశం ఉన్నతికి కారణం అవుతాను..బాధ్యతతో నడుచుకుంటాను ఈ మాటలే ప్రతి యువత పాటింపులో ఉండాలి.. నాయకుల జీవితాల్లో ఉండాలి.. యువత కు మరింత బాధ్యత ను చైతన్యాన్నీ అందించే క్రమంలో మీరు ఏ కార్యక్రమం నిర్వహించండి నేను తప్పక హాజరవుతాను అని అంటారు యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు.
అదేవిధంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిన్నటి సందేశంలో శక్తిమంతం అయిన దేశ నిర్మాణానికి యువత భాగస్వామ్యం తప్పని సరి అని, అదే అందరి లక్ష్యం కావాలి అన్నారు. పిలుపునిచ్చారు. ఓ సామాన్య స్థాయిలో నడిచే సంస్థలు ఇవి.. నేను మీకు అండగా ఉంటాను అని అంటూ.. ఈ కార్యక్రమాలు నేను రావడం కాదు మీరు నిర్వహించడమే గొప్ప అని అంటారాయన.. ఇవీ నిన్నటి అల్లూరి వేడుకల్లో వినిపించిన 4 మంచి మాటలు..అతి లేని వాస్తవ దూరం కాని 4 మాటలు.
రెండు ప్రత్యేక సందర్భాలు నిన్నటి వేళ నడయాడాయి. నమోదుకు నోచుకున్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి. స్వామీ వివేకానంద వర్థంతి. ఈ రెండు కార్యక్రమాలకూ ఒకటే వేదిక. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద సేవా సమితి నిర్వహించిన ఈ వేడుకకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విచ్చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు విచ్చేశారు. పార్టీలకతీతంగా ఆ ఇద్దరూ విచ్చేసి నివాళులు ఇచ్చి వెళ్లారు.
పొద్దున లేచిన దగ్గర నుంచి తిట్ల దండకాలతో రాజకీయాలు నడిపే నాయకులకు ఇలాంటివి చూసైనా కాస్తో కూస్తో బుద్ధి రావాలి. ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ గౌరవ పార్లమెంట్ సభ్యులు అని రామూను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ కుర్రాడు బాగా పనిచేస్తున్నాడు పనిచేయనివ్వండి అని కూడా ప్రయివేటు సంభాషణల్లో వ్యాఖ్యానిస్తారు. పార్టీలు వేరయినా నాయకుల మధ్య కలుసుకునే సందర్భాలు పెద్దలకు నివాళులు ఇచ్చే సంప్రదాయం ఇంత హుందాగా ఉండాలి అని చాటి చెప్పారు ఆ ఇద్దరూ..
ధర్మాన ప్రసంగంలో… దేశ సమగ్రతకు పటిష్టతకు అంతా కృషి చేయాలి అని, ఇటువంటి కార్యక్రమాలు అందుకు సహకరిస్తాయి అని, దోహదపడతాయి అని, పటిష్టమైన దేశంతోనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి అని చెప్పారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తన ప్రసంగంలో వీరుల ఔన్నత్యాన్ని కాపాడేందుకు దేశ యువత నిరంతరం కృషి చేయాలని, దేశ కీర్తి,ప్రతిష్టలు అన్నవి యువత పెంపొందింజేయాలని అన్నారు.
వేడుకల్లో ఆ ఇద్దరి మాటలు ప్రభావశీలకంగా సాగాయి. ఉద్వేగభరితంగా సాగాయి. దేశాన్ని నడిపే శక్తులు చైతన్యాన్ని ప్రోది చేసే క్రమంలో ఉంటే బాగుంటుంది అనేందుకు తార్కాణం నిన్నటి కార్యక్రమం.
Comments 1