మన దేశంలో ఎన్నికలంటే జనాలకు ఓ పండుగ వంటిది. ఓటుకు నోటు ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఇక, ఏదో ఒక పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తే చాలు…ముప్పూటలా తిండి…ఆ రోజు కూలీ….తాగినోడికి తాగి ఊగినంత మందు. ఇక, రాజకీయ నాయకులకైతే తమ అదృష్టాన్ని ఐదేళ్లకోసారి పరీక్షించుకునే రోజు. అందుకే, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశ్యంతో ఉచిత పథకాలతో ఊదగొడుతుంటారు. పప్పు బెల్లాల్లా తాయిలాలిస్తూ ప్రజలను మభ్యపెడుతుంటారు.
ఇలా, వెలుతురు పురుగులను ఆకర్షించినట్లు… ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలు, ఉచిత తాయిలాలు, హామీలు ప్రజలను ఆకర్షిస్తుంటాయి. కట్ చేస్తే….అటువంటి అలివికాని హామీలను కొందరు రాజకీయ నాయకులు తుంగలో తొక్కుతుంటే…ఏపీ సీఎం వంటి మడమతిప్పని కొందరేమో ఉద్యోగుల జీతాలు ఆపి మరీ పథకాలకు డబ్బును ఖజానా నుంచి పెడుతుంటారు. ఇక, శ్రీలంక సంక్షోభం నేపథ్యంలోనే ఏపీ తరహా రాష్ట్రాపై ప్రదాని మోదీని సీనియర్ అధికారులు అప్రమత్తం చేశారు.
ఆయా రాష్ట్రాల అప్పలను, ఆర్థిక పరిస్థితిని చెక్ చేసి వారి పంపకాలకు చెక్ పెట్టకుంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కూడా శ్రీలంక, గ్రీస్ మాదిరే దిగజారొచ్చని ప్రధానిని వారు హెచ్చరించారు. సీనియర్ అధికారులతో ప్రధాని నిర్వహించిన సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని హామీలను కొన్ని పార్టీలు ఇచ్చాయని, ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉందని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో అవి భాగం కాకపోయి ఉంటే ఇప్పటికే ఆర్థికంగా పతనమై ఉండేవని ఆ అధికారులు అభిప్రాయపడ్డారు.
ఏపీ, పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ,, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు ఆర్థికంగా సాధ్యం కానివని వారు వెల్లడించారు. ఈ విషయంలో కొన్ని పరిష్కారాలను గుర్తించకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరించారు. కొన్ని పార్టీలు ఆఫర్ చేస్తున్న ఉచిత విద్యుత్తు రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నట్టు చెప్పారు. ఈ తరహా ఉచితాల వల్ల కీలకమైన ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు నిధుల కేటాయింపులు చేసే వెసులుబాటు ఉండడం లేదని వారు ప్రధానికి చెప్పారు.