నవ్యాంధ్ర ప్రదేశ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్రపతి పాలనను తెచ్చే లా కనిపిస్తున్నాయా? అంటే అర్ధాంగీకార మౌనాన్నే ప్రదర్శిస్తున్నారు న్యాయ నిపుణులు. హఠాత్తుగా మారిన పరిణామాలు న్యాయవ్యవస్థకు-ఏపీ సర్కారుకు మధ్య పెరుగుతున్న అగాథం,అధికార పార్టీ నేతల వ్యవహారం,అదేసమయంలో హైకోర్టులో పడుతున్న కేసులు వంటివి తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
దాదాపుగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా న్యాయ వ్యవస్థపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం,గత ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణకు మధ్య జరిగిన వ్యవహారం అంటూ కొన్ని పత్రాలను బయట పెట్టడం వంటివి నిజంగానే పెను సంచలనం సృష్టించాయి.
రాజధాని అమరావతిలో భూముల కోనుగోలుకు సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం, దర్యాప్తుకు దిగుతున్న నేపథ్యంలో హైకోర్టు దీనిపై స్టే విధించింది. ఇక దీనికి ముందు కూడా ప్రభుత్వం తీసుకున్న కొన్నినిర్ణయాలను కూడా కోర్టు తోసిపుచ్చింది.
ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు రంగుల విషయంలో హైకోర్టు వ్యవహరించిన తీరు ప్రభుత్వంపై బాగానే పనిచేసింది. చివరకు రంగులు మార్చకతప్పలేదు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంపైనా హైకోర్టు ఇచ్చిన తీర్పు, తదనంతర పరిణామాలు ప్రభుత్వ వ్యూహానికి బ్రేకులు వేశాయి. ఇక, ఈ క్రమంలోనే హైకోర్టుపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియా వేదికగా న్యాయవ్యవస్థను టార్గెట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రావడం లేదు కనుకనే ఇలా న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపించింది. దీనిపై నేరుగా హైకోర్టు రిజిస్ట్రీనే ఇచ్చిన ఫిర్యాదుతో న్యాయస్థానం రంగంలోకి దిగింది. అయితే ఈ క్రమంలో పరిస్తితిని సర్దుబాటు ధోరణిలో ముందుకు తీసుకువెళ్లాల్సిన వైసీపీ మరింతగా పెంచే క్రతువుకు శ్రీకారం చుట్టింది. వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన వారికి మద్దతుగా నిలుస్తామని వ్యాఖ్యానించడం వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసింది.
కట్ చేస్తే ఈ అంశంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇక ఇప్పుడు ఇది స్వతంత్ర సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. కేవలం 8 వారాల్లోనే తమకు నివేదిక ఇవ్వాలని, ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని కూడా స్పష్టం చేసింది. దీంతో న్యాయవ్యవస్థపై కామెంట్లు చేసిన వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక నేర నేతలపై విచారణను తీవ్ర తరం చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీఎం జగన్ సహా పలువురిపై నమోదైన కేసుల విచారణ పుంజుకుంది. సీఎం జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణను రోజువారీగా జరిపేందుకు సీబీఐ కోర్టు సిద్ధమైంది. ఇక ఆవ భూ కుంభకోణానికి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల పాత్ర ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ కుంభకోణంలో భారీగానే డబ్బులు చేతులు మారాయని అధికార పార్టీలోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఒకవైపు న్యాయవ్యవస్థతో కీచులాట, మరోవైపు భారీగా పెరిగిపోయిన అవినీతి, ఇంకోవైపు సీఎం జగన్‌పై సీబీఐ విచారణ ప్రారంభం కావడం వంటి పరిణామాలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి గురవుతోంది. ఈ నేపథ్యంలో విషయాన్ని పక్కదారి పట్టించి, చర్చను మళ్లించేలా జగన్ వ్యూహాత్మకంగా ఢిల్లీ పర్యటనను తెరమీదికి తెచ్చినట్టు చెబుతున్నారు పరిశీలకులు. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇదంతా దృష్టి మళ్లించేందుకేనని అంటున్నారు. ఇదిలావుంటే,రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? అంటూ తాజాగా హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దాఖలైన కేసుల విచారణలో రాజ్యాంగ విచ్ఛిన్నంపై వాదనలు వింటామని కూడా చెప్పింది. దీంతో నిజంగానే హైకోర్టు కనుక రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందనిఅభిప్రాయ పడితే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పొంచి ఉందనేది న్యాయ నిపుణుల మాట. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్తితి ఏదిశగా మలుపు తిరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండడం గమనార్హం.