ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం కొద్ది నెలలుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతుండగా….కరోనా, వ్యాక్సినేషన్ సాకుతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ససేమిరా అంటోంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో కోర్టు కూడా ఎస్ఈసీకి అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలలుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన లోకల్ వార్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెరదించారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై తాజా ప్రొసీడింగ్స్‌ను ఎస్ఈసీ విడుదల చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చించామని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ సాకుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తోందని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని నిమ్మగడ్డ అన్నారు.
ఎట్టకేలకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను నిమ్మగడ్డ విడుదల చేశారు. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. ఏపీలో మొత్తం 4 దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 23న తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 27న రెండో దశ ఎన్నికలకు, జనవరి 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నామని నిమ్మగడ్డ ప్రకటించారు. ఏపీలో జనవరి 9 నుంచి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అంతకుముందు, ఎన్నికల నిర్వహణపై సీఎస్ ఆదిత్యనాథ్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి అధికారులు రాసిన లేఖకు నిమ్మగడ్డ జవాబు పంపారు. తిరుపతి ఉపఎన్నిక తర్వాతే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారని నిమ్మగడ్డ గుర్తు చేశారు. దీనినిబట్టి తాను ఎస్ఈసీగా ఉండగా ఎన్నికలు జరపకూడదన్న నిర్ణయం అధికార పార్టీ తీసుకుందన్న భావన కలుగుతోందని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. మరోవైపు, ఎస్ఈసీ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.