అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సదస్సు-2024’’కు ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథిగా హాజరై పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌తో సమావేశమైన లోకేష్…ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏపీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ నాయకత్వం ఉపకరిస్తుందని అన్నారు. ఏపీ స్మార్ట్ గవర్నెన్స్ లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహిస్తాయని చెప్పారు. ఏపీని ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలని, ,2030 నాటికి 72 గిగా వాట్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేయాలని కోరారు. ఏడబ్ల్యూఎస్ తదుపరి డేటా సెంటర్‌కు తమ రాష్ట్రం అనువైన ప్రాంతమని చెప్పారు. ఏపీలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌరసేవలకు ఏడబ్ల్యూఎస్ సహకారం అవసరముందన్నారు.
లోకేష్ ప్రతిపాదనలపై స్పందించిన రేచల్ స్కాఫ్.. ఏపీలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్‌పై అమెజాన్ దృష్టి సారిస్తోందని అన్నారు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్‌బీఎన్‌బీ, 3ఎం వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉంది, ఏడబ్ల్యూఎస్ ప్రపంచవ్యాప్తంగా 32 శాతం మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉందని తెలిపారు.
కాగా, రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్‌తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో టెక్ టాలెంట్ డెవలప్మెంట్ సెంటర్‌ను నెలకొల్పేందుకు రెవేచర్ భాగస్వామ్యం వహించాలని లోకేష్ కోరారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు అనుగుణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంప్‌లను అందించడానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేయాలని అన్నారు. ఏపీలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు. దీనికి అశ్విన్ సానుకూలంగా స్పందించారు.