ఈ రోజు ప్రధాన మీడియా సంస్థలు తాటికాయంత హెడ్డింగులతో పబ్లిష్ చేసిన ఒక కథనం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించి.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్థానంలో ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి రాసిన స్క్రిప్టుకు తగ్గట్లు వ్యవహరించటమే కాదు.. ఆయన డైరెక్షన్ లో ఏపీ ఐపీఎస్ లు ఇద్దరు వ్యవహరించిన తీరు.. దీనికి ముంబయికి చెందిన నటి ఒకరు పరేషాన్ కావటమే కాదు.. ఆమె కుటుంబంతో సహా జైల్లో ఉండాల్సిన పరిస్థితికి సంబంధించిన వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగింది? ఎవరా ముంబయి నటి? ఆమె విషయంలో సజ్జల ఎందుకంతలా రియాక్టు అయ్యారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు షాకింగ్ గా మారాయి.
ముంబయికి చెందిన ఒక నటి (మరీ అంత ఫేమస్ కాదు. ఒక మోస్తరు స్థాయి నటిగా చెబుతున్నారు)ని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న క్రిష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు ఒకరు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నారని.. పెళ్లి చేసుకోకుండా మోసగించారన్న అభియోగం ఒక పక్క.. అదేమీ కాదు.. ఆమె ఒక బడా పారిశ్రామికవేత్త కొడుకు మీద పెట్టిన కేసును ఏపీలో సజ్జల డైరెక్షన్ లో సెటిల్ చేశారన్నది రెండో ఆరోపణ. మొత్తంగా ఈ క్రైం ప్రేమకథా చిత్రమ్ ఉదంతంలో పలు పాత్రలు ప్రధాన పాత్రలు పోషించాయి. ప్రముఖ మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన ఈ ఉదంతాన్ని చూస్తే..
క్రిష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కె.నాగేశ్వరరావు కొడుకు విద్యాసాగర్. ఇతను 2014లో పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీసీ తరఫు పోటీ చేశాడు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లోని ఒక పెళ్లికి వెళ్లాడు. అక్కడ ముంబయికి చెందిన సినీ నటితో పరిచయం ఏర్పడింది. ఏళ్ల తరబడి వారు సన్నిహితంగా మెలిగారు. తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. విద్యాసాగర్ నో చెప్పారు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి మరింత పెరగటం.. ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న ఉద్దేశంతో ఆమె వ్యవహారాన్ని సెట్ చేయాలని అప్పటి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామక్రిష్ణారెడ్డిని ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఆయన.. ఆ విషయాన్ని చూడాలంటూ నాటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా ఉన్నకాంతిరాణాను ఆదేశించారు.
వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉంటారన్న ఆరోపణలు ఉన్నా కాంతి రాణాకు సజ్జల నుంచి ఆదేశాలు రావటంతో మరింత చురుగ్గా వ్యవహరించారు. వాయు వేగంతో ఆయన తన టీంతో సరికొత్త స్క్రిప్టును సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ముంబయి నటి మీదా.. ఆమె కుటుంబీకుల మీదా విద్యాసాగర్ నుంచి కంప్లైంట్ తీసుకున్న వారు ఆగమేఘాల మీద ఫిబ్రవరి 2న ఇబ్రహీం పట్నం పీఎస్ లో నేరపూరిత కుట్ర.. మోసం.. ఫోర్జరీ.. బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేశారు.
అప్పట్లో విజయవాడ డీసీపీగా పని చేసే ఒక యువ ఐపీఎస్ అధికారి.. ఒక ఏడీసీపీ.. ఏసీపీ.. ఇన్ స్పెక్టర్లు.. ఎస్సైలతో కూడి టీంను ఫ్లైట్ లో ముంబయికి పంపారు. కరడుగట్టిన నేరగాళ్ల మాదిరి సినీ నటిని.. ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తీసుకొచ్చారు. వీరు ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర బెదిరింపులు ఎదురయ్యాయి. పెళ్లి మాట ఎత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చి.. వారితో ఖాళీ కాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ పరిణామాలతో బెదిరిపోయిన సదరు సినీ నటి.. ఆమె కుటుంబ సభ్యులు బతుకు జీవుడా అనుకుంటూ రిమాండ్ ముగిసిన తర్వాత బెయిల్ మీదా.. ఆ తర్వాత రాజీ చేసుకున్నట్లుగా కోర్టులో పిటిషన్ వేసి విషయాన్ని క్లోజ్ చేశారు.
దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగు చూశాయి. అయితే.. సదరు నటి ఈ ఘటనకు కొన్ని నెలల ముందు దేశంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుటుంబీకుడు ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ముంబయిలో ఒక కేసు పెట్టినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ ఇష్యూను ముంబయిలో సెటిల్ చేస్తే తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే వీలుందన్న ఉద్దేశంతో.. ఏపీలో సెట్ చేసినట్లుగా మరో ఆరోపణ ఉంది. ఆ కుటుంబానికి నాటి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిగణలోకి తీసుకొని ఇలా చేయించినట్లుగా చెబుతున్నారు. దీన్ని విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందుపెట్టి కథ నడిపించినట్లుగా పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో భారీగా చేతులు మారినట్లుగా చెబుతున్నారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గా పని చేసిన కాంతిరాణా తాతా వివాదాస్పద తీరుకు ఇదో మచ్చుతునకగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ అరాచకాలకు కొమ్ము కాసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారన్నది తాజా ఆరోపణ. ఇదిలా ఉంటే.. సదరు బాధితురాలు ఇప్పుడు బయటకు వచ్చి.. తనకు జరిగిన అన్యాయంపై కంప్లైంట్ ఇస్తే.. విచారణ జరిపి.. తగిన చర్యలు తీసుకుంటామన్న మాటను ఏపీపోలీసులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం షాకింగ్ అనుభవం ఏపీలో ఎదురైన తర్వాత.. ఇప్పుడు మళ్లీ వచ్చే ధైర్యం ఆ ఫ్యామిలీ చేస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.