నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఏ నెల అప్పు పుట్టకపోతే ఆ నెలలో దివాలా తీసే దుస్థితిలో ఉంది. ఏదైనా నెలలో కనీసం రూ.7,000 కోట్లయినా అప్పు పుట్టకపోతే ఆ నెలలో రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర స్థితి దాపురిస్తుంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు నెలకు సగటున రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి దాదాపు రూ.1,20,000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. కానీ ఆర్థిక శాఖ రాష్ట్ర ఆదాయాన్ని రూ.1,06,000 కోట్లకు మాత్రమే పరిమితం చేసింది. మిగిలిన ఆదాయాన్ని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నేరుగా వచ్చే ఆదాయం కింద చూపించింది. దీంతో రాష్ట్ర ఖజానా ఆదాయం తగ్గిపోయింది.
కొన్ని కార్పొరేషన్లను చూపించి బ్యాంకుల్లో రాష్ట్ర అవసరాల కోసం అప్పులు తెచ్చి ఆ కార్పొరేషన్‌కే ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. ఇలాంటి వాటిని రాష్ట్ర ఖాతా కింద చూపడం లేదు. ఉదాహరణకు వాటర్ కార్పొరేషన్. వాటర్ సెస్, పండిన పంటలో కొంత మొత్తం వసూలు చేస్తామని పేపర్లపై రాసి, దాన్నే ఆదాయంగా చూపి బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు అప్పులు తెస్తున్నారు.
వాస్తవంగా వాటర్ సెస్, పంటల్లో కొంత ఆదాయం తీసుకోవడం లాంటివి క్షేత్రస్థాయిలో జరగడం లేదు. అప్పుల కోసం ఆర్థిక శాఖ చేస్తున్న మాయ ఇది.
తేడా వస్తే ఆర్బీఐ చేతిలోకే..
కొవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వానికి నెలకు సగటున రూ.10,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఇది కాకుండా ప్రతి నెలా సగటున రూ.6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల అప్పు లేనిదే రాషా్ట్రనికి జరగడం లేదు. ఈ మొత్తం డబ్బును అప్పుల రీపేమెంట్లు, వడ్డీ చెల్లింపులు, పథకాలు, కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు వినియోగిస్తున్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు. నెలకు ఆదాయం, అప్పులు కలిపి రూ.17,000 కోట్లు వస్తున్నప్పటికీ బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఏదైనా నెలలో అప్పు పుట్టకపోతే ఉద్యోగుల వేతనాలా? సంక్షేమ పథకాల అమలా? ఏదో ఒకదానినే ఎంచుకోవలసిన పరిస్థితి తలెత్తుతోంది. ఉద్యోగుల వేతనాలు ఇవ్వకుంటే రాష్ట్రం దివాలా తీసినట్లే.
ఈ పరిస్థితి వస్తే రాష్ట్ర ఖజానా నిర్వహణ పూర్తిగా ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మొదట అప్పుల తిరిగి చెల్లింపు, వడ్డీల చెల్లింపునకే ఆర్బీఐ వినియోగిస్తుంది. తర్వాత ఏమైనా మిగిలితే ఆస్పత్రుల నిర్వహణ లాంటి అత్యవసర సేవలకు వినియోగిస్తుంది.
ఇంకా మిగిలితే ఉద్యోగులకు ఎంతో కొంత వేతనాలిస్తుంది. ఆదాయానికి తగ్గ విధంగా ఖర్చులు తగ్గించుకోకుంటే ఈ దుర్గతి తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదినచందంగానే ఉంది.