- అప్పుల ఊబిలో దించేసిన జగన్ ప్రభుత్వం
- రూ.4.35 లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు
- మరో 27 వేల కోట్లు కావాలట!
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక క్రమశిక్షణకు పెట్టింది పేరు. పకడ్బందీ పాలనా విధానాలకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. ఇప్పుడు ఆర్థికంగా అస్తవ్యస్తం. ఆర్థిక క్రమశిక్షణకు దూరం! అప్పుల కుప్పలా మారిపోయింది. ‘‘మా రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వండి. మా ప్రాజెక్టులకు అనుమతులివ్వండి. మా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేలా చూడండి’’… ఏ ముఖ్యమంత్రైనా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కోరేది ఇవే! కానీ నవ్యాంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డి తీరే వేరు. అంతులేని అప్పుల దాహంతో ప్రధానిని కలుస్తున్నారు.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు రూ.27,325 కోట్ల అదనపు అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని జగన్ కోరారు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంటులో వెల్లడించింది. అంతేకాదు… గతనెల 3వ తేదీన జగన్ అప్పులకు అనుమతి కోరేందుకే ఢిల్లీకి వచ్చారని తెలిపింది. రెండున్నరేళ్లుగా జగన్ సర్కారు అప్పులు చేయడమే పనిగా పెట్టుకుంది. ఆ అప్పుల అసలు, వడ్డీలు చెల్లించడానికే ఖజానా సరిపోవడంలేదు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పటికే నిండా మునిగిపోయాం. ఇక బయటపడే దారే లేదు’ అని ఆర్థిక నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అనుమతి ఇచ్చిన అప్పులివీ..
2021-22లో రూ.42,472 కోట్లు అప్పు చేసుకోవడానికి కేంద్రం ఆంధ్రకు అనుమతిచ్చింది. అయితే గత రెండున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం అనుమతికి మించి అదనంగా రూ.17వేల కోట్లు అప్పు చేసింది. దీంతో ఆ మొత్తానికి కోత పెట్టి ఈ ఆర్థిక సంవత్సరం రూ.25,472 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతించింది. ‘ఒకేసారి అంత కోస్తే భరించలేం. దానిని మూడేళ్లకు సర్దుబాటు చేయండి’ అని రాష్ట్రం కోరింది.
ఇందుకు కేంద్రం అనుమతించిందో లేదో తెలియదు. కానీ రాష్ట్రం నానాటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు కేంద్రం సహకరిస్తుండడం గమనార్హం. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు చాలవన్నట్టు జనవరి, ఫిబ్రవరి, మార్చి కోసం అదనంగా రూ.27,325 కోట్ల అప్పు కావాలని సీఎం జగన్ కోరడం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతిచ్చిన రూ.40,655 కోట్ల అప్పును రాష్ట్రప్రభుత్వం పూర్తిగా ఆర్బీఐలో సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా మాత్రమే తెచ్చింది. ఈఏపీలు, నాబార్డు, ఎన్సీడీసీ రూపంలో తీసుకున్న అప్పులను, ఉద్యోగులకు సంబంధించి వాడుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులను కూడా కలిపితే… మరో రూ.20వేల కోట్ల వరకు ఉంటాయి. 2021 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 9 నెలల్లో జగన్ ప్రభుత్వం రూ.58,142 కోట్ల అప్పులు చేసినట్టు డిసెంబరు నెల నివేదికలో కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది.
రూ.4.13 లక్షల కోట్లకు పబ్లిక్ డెట్
ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 2021 మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్ర పబ్లిక్ డెట్ రూ.3.55 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాతి 9 నెలల్లో రూ.58,142 కోట్ల అప్పు చేసినట్టు కాగ్ స్వయంగా వెల్లడించింది. వెరసి… ప్రస్తుతం రాష్ట్ర పబ్లిక్ డెట్ రూ.4.13 లక్షల కోట్లకు చేరుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) ప్రకారం ఈ అప్పు మొత్తానికి కౌంటర్ గ్యారెంటీ ఉన్నట్టే.
రాష్ట్రంలో కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల స్కామ్‌పై కేంద్రానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ కేంద్రం ధారాళంగా అప్పులకు అనుమతి ఇస్తోంది. అవి కూడా చాలవని… మళ్లీ మళ్లీ అప్పుల కోసం ఎప్పటికప్పుడు రాష్ట్రం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.
చేబదుళ్లలోనూ నంబర్ వన్!
అప్పుల్లోనే కాదు.. ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ), వేస్ అండ్ మీన్స్, రిజర్వు బ్యాంకు నుంచి పొందే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీలో కూడా ఆంధ్రప్రదేశే నంబర్ వన్ అని తేలింది. 2021 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు ఈ మూడు రకాల చేబదుళ్ల కింద దేశంలోని 29 రాష్ట్రాలన్నీ కలిపి రూ.97,075 కోట్లు వాడుకుంటే.. అందులో మూడో వంతు రూ.32,271 కోట్లు.. ఒక్క మన రాష్ట్రమే తెచ్చింది.
రిజర్వుబ్యాంకు నెలనెలా విడుదల చేసే బులెటిన్లను అధ్యయనం చూస్తే ఈ విషయం బట్టబయలైంది. పరిస్థితి ఇలా ఉంటే.. జగన్ సర్కారు గొప్ప ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోందని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సగర్వంగా చెప్పారు. ఇదేనా ఆ గొప్ప ఆర్థిక క్రమశిక్షణ? రాష్ట్రం ఆర్థిక అత్యవసర పరిస్థితికి చేరువలో ఉందని.. విజయసాయిరెడ్డి మాత్రం ఆర్థిక క్రమశిక్షణలో నంబర్‌వన్ అని నిస్పిగ్గుగా కితాబిచ్చుకుంటున్నారని నిపుణులు విమర్శిస్తున్నారు.