- పీఎఫ్సీ, ఆర్ఈసీ అప్పుల చెల్లింపులకు దొడ్డిదారి
- హుటాహుటిన ఎస్బీఐతో సంప్రదింపులు
- రూ.1,500 కోట్ల కొత్త అప్పు ఇచ్చిన బ్యాంకు
- అక్రమ అప్పులకు మద్దతా?
- ఎస్బీఐ వైఖరిపై బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్రచర్చ
చరిత్రలోనే అంతుపట్టని మిస్టరీ ఇది. అప్పులు తీసుకురావడంలోనే కాదు.. తీసుకొచ్చిన వాటి వి చెల్లింపుల్లోనూ జగన్ సర్కారు వక్రమార్గాల్లో నడుస్తోంది. ఇందుకు దేశంలోని ప్రధాన బ్యాంకు ఎస్బీఐ సైతం వంతపాడడం విస్మయానికి గురిచేస్తోంది. కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లకు రాష్ట్ర డిస్కమ్‌లు వేల కోట్లు బకాయిపడ్డాయి.
ఎన్ని సార్లు గుర్తుచేసినా రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవడంతో ఇటీవల ఢిల్లీ, ముంబై నుంచి ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా, పీఎఫ్సీ సీఎండీ రవీందర్‌సింగ్ థిల్లాన్, ఇతర అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. తమకు బకాయిపడ్డ అప్పు చెల్లిస్తారా ? లేదా డిఫాల్టర్‌గా ప్రకటించమంటారా అని వారు సర్కారు పీకమీద కత్తిపెట్టారు.
డీఫాల్టర్‌గా ప్రకటిస్తే ఇక రూపాయు కూడా అప్పు పుట్టదు. దీంతో ఆ రోజు చెల్లించాల్సిన రూ.4,000 కోట్ల అప్పులో రూ.1500 కోట్లు తక్షణం చెల్లించి మిగిలినవి తర్వాత చెల్లించేలా ఆర్ఈసీ, పీఎఫ్‌సీలతో ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. దీంతో హుటాహుటిన ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కారాతో రాష్ట్ర ఆర్థిక సలహాదారు, ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంప్రదింపులు జరిపి అతికష్టమ్మీద రూ.1,500 కోట్ల అప్పు ఇచ్చేందుకు ఒప్పించారు. అయితే ఆర్ఈసీ, పీఎఫ్‌సీలకు బకాయిపడింది ఏపీ జెన్కో.
జెన్కో పేరుతో ఆ సంస్థల నుంచి వేల కోట్ల రుణాలు తెచ్చుకుని ప్రభుత్వం వాడుకుంది. కాబట్టి జెన్కో లేదా ప్రభుత్వమే ఆ అప్పును చెల్లించాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆర్బీఐ తప్ప మరే బ్యాంకూ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకూడదు. కాబట్టి ఎస్బీఐ ఆ రూ.1,500 కోట్లను జెన్కో ఖాతాలో వేస్తుందనుకున్నారు. కానీ దాని ఖాతాలో డబ్బులు పడలేదు.
ఎందుకంటే కొత్తగా అప్పులు తెచ్చుకునే సామర్థ్యం ఇక జెన్కోకి లేదు. విద్యుదుత్పత్తి లేదు. కొత్తగా తనఖా పెట్టడానికి ఆస్తులేమీ మిగల్లేదు. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి గ్యారంటీల పరిమితి ఎప్పుడో ముగిసిపోయింది. దీంతో ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శించి ఎస్బీఐ నుంచి ఆ అప్పును జెన్కోకు బదులు ఏపీ మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ ఖాతాలో వేయించినట్లు సమాచారం.
అక్కడ నుంచి వాటిని ఆర్ఈసీ, పీఎఫ్సీకి చెల్లించారని తెలిసింది. ఈ అప్పుల వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని మారిటైమ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు తెరపైకి వచ్చింది..? ఎస్బీఐ ఏ విధంగా, ఎందుకు ఆ కార్పొరేషన్‌కు అప్పు ఇచ్చిందో అంతుపట్టడం లేదు.
తీరప్రాంతాల అభివృద్ధి కోసం మారిటైమ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటుపరం చేశారు. అయినప్పటికీ మారిటైమ్ కార్పొరేషన్‌కు ఇంత భారీ రుణం ఎందుకు? ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి అప్పు ఎవరు తీసుకున్నారు? ఎవరు వాడుకున్నారు.. ఎవరు కడుతున్నారనేది రాష్ట్ర అప్పుల చరిత్రలో ఊహకందని మిస్టరీ.
సాధారణంగా రూ.15,000 అప్పివ్వాలంటేనే 15 షరతులు పెట్టే ఎస్బీఐ రూ.1,500 కోట్లను ఉన్నపళంగా అతి తక్కువ వ్యవధిలో ఎందుకిచ్చినట్లు? సామాన్యులెవరైనా ఇంటి రుణం కావాలంటేనే కొనబోయే ఇంటితో పాటు, ఇతర ఆస్తులు, జీతం, ఇతర ఖాతాదారుల ష్యూరిటీలు, ఫీల్డు విజిట్లు చేసిగానీ అప్పులివ్వని బ్యాంకు ప్రభుత్వానికి ఇంత భారీ మొత్తం ఎందుకిచ్చింది? ఎలా ఇచ్చిందన్న అంశంపై బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది.
పాత అప్పులు చెల్లించడానికి బ్యాంకులు కొత్త అప్పులు ఇస్తున్నాయి. అది కూడా ఇతర ఆర్థిక సంస్థల అప్పులు చెల్లించడం కోసం. ఇంతటి కరుణ బ్యాంకులు సామాన్యులపై చూపించవెందుకు? అలాగే ప్రభుత్వం ఉచిత పథకాల అ మలు కోసం కూడా బ్యాంకులు ఎ గబడి అప్పులిస్తున్నాయి. రాష్ట్రం ఏమైపోతేనేం, వడ్డీ వస్తే చాలు, తమ టార్గెట్లు చేరుకుంటే చాలనే ధోరణి బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రస్తుతం బలంగా నాటుకుపోతోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూలిపోవడానికి వైసీపీ ప్రభుత్వం, ఐఏఎస్ అధికారులు ఎంత కారణమో ? దొంగచాటున రాష్ట్ర ఆస్తులు తాకట్టుపెట్టుకుని రాష్ట్రానికి సామర్థ్యానికి మించి అప్పులిస్తున్న బ్యాంకులూ అంతే కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
సీఎం అడిగినా వచ్చింది రూ.2500 కోట్లే
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు అప్పుల కోసం మొదట్లో ఆర్థిక శాఖ సెక్రటరీ (అప్పట్లో స్పెషల్ సెక్రటరీ) కేవీవీ సత్యనారాయణ కేంద్రం కళ్లు గప్పడానికి దొంగలెక్కలు పట్టుకుని ఢిల్లీ వెళ్లేవారు. కొన్ని నెలలు ఇలా గడిచాక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(అప్పట్లో ముఖ్య కార్యదర్శి) ఎస్ఎస్ రావత ఢిల్లీ వెళ్లడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన, ఎస్ఎస్ రావత అవే తప్పుడు లెక్కలతో వెళ్లేవారు. వీరితో పాటు అప్పుడప్పుడూ అప్పుల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వెళ్లేవారు. వీరితో పాటు వైసీపీ ఎంపీలు ఒకరిద్దరు ఈ అప్పుల పనిపై సెక్రటరీలు ఇచ్చిన గోల్మాల్ లెక్కలు పట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు వారంతా ఎవరెళ్లినా కొత్త అప్పు పుట్టకపోయే సరికి నేరుగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిశారు. దీంతో ఆ రాత్రికి రాత్రే రూ.2,500 కోట్ల కొత్త అప్పునకు అనుమతి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ఖజానాలో చిల్లిగవ్వ లేదని కేంద్రంతో మొర పెట్టుకోవడంతో తాత్కాలికంగా ఈ రూ.2,500 కోట్ల ప్పునకు అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది.
రాత్రి పొద్దుపోయాక అనుమతిరావడం ఆ రాత్రే ఆర్బీఐకి అప్పుల కోసం ఇండెంట్ పెట్టుకుని తెల్లారి అంటే మంగళవారం ఆర్బీఐ వద్ద జరిగిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ.2,500 కోట్లు ఒకేసారి అప్పు తెచ్చారు. అందులో కొంత ఆర్బీఐ ఓడీ కింద జమ చేసుకోగా.. మిగిలిన డబ్బులతో పెన్షనర్లకు పెన్షన్లు, ఉద్యోగులకు వేతనాలు అరకొరగా ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో వేతనాలు అందాల్సిన ఉద్యోగులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.