నవ్యాంధ్రలో ప్రజా తిరుగుబాటు వస్తుందా? ఇప్పటి వరకు వేచి చూసిన ప్రజలు.. ఇన్నాళ్లు ఓర్చుకున్న ప్రజలు.. ఇక, రోడ్ల మీదకు రావడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు మేధావులు. ఇది నిజం. ఇప్పటికే ఉద్యోగులు, వ్యాపారులు.. అన్ని వర్గాల వారు.. కూడా జగన్ పాలనపై విసిగిపోయారని చెబుతున్నారు.
ఇప్పటికి జగన్ ఏపీలో పాలన రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. పోనీ.. ఒక ఏడాది కరోనా ఎఫెక్ట్ ను తీసేసినా.. మిగిలిన ఏడాదిన్నరలో ఆయన ఏం చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ప్రశ్న. అంతేకాదు.. వస్తున్న రూపాయి వస్తున్నట్టు.. పంచేస్తున్నారు. నిజమే సంక్షేమం సాగాలి. కానీ.. రాష్ట్రం అడుక్కుతినే పరిస్థితి వచ్చేదాకా కూడా సంక్షేమాన్ని కొనసాగిస్తానంటే.. ఎవరు మాత్రం సహిస్తారనేది ప్రధాన ప్రశ్న.
ఇక, కేంద్రం దగ్గర అప్పులు.. అటు బ్యాంకుల నుంచి అప్పులు.. ప్రభుత్వ ఆస్తులను తనఖాపెట్టి అప్పులు.. కార్పొరేషన్ల ద్వారా అప్పులు.. సంస్థ నికర నిధులను తీసేసుకోవడం.. ఇలా రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే.. అది ఏపీలోనే అనే విధంగా జాతీయస్తాయిలోనూ చర్చ జరుగుతోంది.
తాజాగా కూడా ఆయన పందేరానికి హద్దులు లేకుండా పోయాయని విమర్శలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు కాగ్ కూడా.. అసెంబ్లీకి సైతం చెప్పకుండా.. అప్పులు చేస్తున్నారంటూ.. దుయ్యబట్టింది. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనుక అడుగు వేయడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు లేకుండానే పాలన సాగిద్దాం అనే ఆలోచనలకు తెరదీయడాన్ని ఏ ఒక్కరూ సహించడం లేదు.
కష్టమో.. సుఖమో.. ప్రజా తీర్పును గౌరవించాలి కదా! ప్రతిపక్షాన్ని కూడా సాగనివ్వాలి కదా! అనేదివారి వాదన. ఇదే ఇప్పుడు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. మరోవైపు.. మంత్రులుగా ఉన్నవారు.. ఒక్కరికీ బాధ్యతలు లేకుండా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది.
నిజానికి జగన్ చేసే పాలన.. ధనిక దేశాల్లో చెల్లుతుందేమో కానీ.. ఏపీ వంటి విభజిత కస్టాల్లో ఉన్న రాష్ట్రానికి కాదనేది అందరూ అంటున్నమాట.
“ఇప్పటికి రెండున్నరేళ్లు చూశాం. ఎక్కడా వీసమెత్తు అభివృద్ది కనిపించడం లేదు. ప్రజల మాట వినిపించుకోరు. ఎన్నికల్లో వచ్చిన ఓట్లే ప్రామాణికంగా భావిస్తున్నారు. ఇది సరికాదు. ఇది రాష్ట్రాన్ని మరింతగా అప్పుల్లో ముంచెత్తుతుంది. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది!“ అని విశాఖకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు వ్యాఖ్యానించారు.
ఇక, ఉద్యోగులు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. మరోవైపు.. తమ సంస్థ ఆస్తులు దోచేస్తున్నారంటూ.. ఎన్టీఆర్ విశ్వవిద్యా లయానికి చెందిన ఉద్యోగులు కూడా రోడ్డెక్కుతున్నారు. చిరుద్యోగులు తమకు వేతనాలు లేవంటూ.. రోడ్డున పడుతున్నారు.
డ్వాక్రా సంఘాల మహిళల పొదుపు సొమ్ము 2000 కోట్లు తీసుకోవడంపై వారు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇక, మధ్యతరగతి వర్గం.. అన్ని ధరలూ మండిపోతున్నాయని తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వెరసి.. ఇప్పుడు ఏపీలో పరిస్థితి.. దారుణంగా ఉందని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకటి కాకపోతే ఒక విషయంలో అయినా.. జగన్ సమర్ధుడనే విధంగా చర్చించలేని పరిస్థితి వచ్చిందని వారు కుండబద్దలు కొడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలు పెరుగుతాయని.. ప్రజలే ఎవరిసారథ్యం లేకుండా రోడ్డెక్కే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే.. దేశంలో తొలి తిరుగుబాటు ఏపీలోనే వస్తుందని అంటున్నారు.