ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సెక్యూరిటీ విషయంలో ఈ మధ్య నానా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. సీఎం హోదా పోయినా కూడా సీఎం తరహా సెక్యూరిటీనే తనకు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఎన్నికల తర్వాత కావాలనే తన భద్రత తగ్గించారని, ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కూటమి సర్కార్ పై జగన్ అరోపణలు చేశారు. తన భద్రతను పునరుద్ధరించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూ ఉంది.
అయితే ఇదే తరుణంలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత జగన్ పై సెటైర్లు పేల్చారు. సోమవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన అనిత.. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు. ఈ క్రమంలోనే స్నేహ బ్లాక్ వద్దకు వెళ్లాగా.. అనిత భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా ప్రభుత్వం అన్యాయంగా చంద్రబాబును జైలుకు పంపి.. 53 రోజులు ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. జగన్ హయాంలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడే అన్నారు. వైసీపీ అరాచక పాలన వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయానని మండిపడ్డారు. ప్రజలు బలమైన తీర్పుతో వారి పాపాలు పండాయని అనిత అన్నారు. ఇక వైఎస్ జగన్ భద్రతను ఎవరూ తొలగించలేదని.. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత కల్పించామని అనిత పేర్కొన్నారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని భయంతోనే జగన్ ఇంత రాద్ధాంతం చేస్తున్నారని సెటైర్ పేల్చారు. ఏపీలో 20వేల మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా? అని హోం మంత్రి ఫైర్ అయ్యారు.