సాధారణంగా ఏదైనా కంపెనీ పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య కారకాలు వెలువరిస్తుండడం, లేదంటే పొల్యూషన్ బోర్డు నిబందనలు పాటించడం వంటివి చేస్తే సదరు కంపెనీకి నోటీసులు ఇవ్వడం ఆనవాయితీ. ఆ కంపెనీకి ఇచ్చిన నోటీసు పిరియడ్ లోపు నిబంధనలు పాటించకపోతే దానిపై చర్యలు తీసుకోవడం సబబు.
అయితే, ఏపీలోని జగన్ జమానాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జువారీ సిమెంట్ కంపెనీని మూసివేయాలంటూ పొల్యూషన్ బోర్డు ఏకంగా ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపింది. అయితే, ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది.
కడపలోని జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత వ్యవహారంలో జగన్ కు షాక్ తగిలింది. కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ బోర్డు సూచనలను ఈ నెల 31లోపు అమలు చేయాలని జువారీ సిమెంట్స్‌కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 31వ తేదీ వరకు కంపెనీ నడుపుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
నిబంధనలు పాటించడం లేదంటూ ఏప్రిల్ 24న జువారీ సిమెంట్ సంస్థను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకు తక్షణం కరెంట్ సరఫరా నిలిపివేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జువారి సిమెంట్ కాలుష్య పరంగా తీసుకోవాల్సి జాగ్రత్తలు తీసుకోవడం లేదని వెల్లడించింది.
హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జువారీ సిమెంట్ కాలుష్యం వెదజల్లుతుంటే….భారతీ సిమెంట్ ఆక్సిజన్ వదులుతుందా ఏంటీ అంటూ చురకలంటిస్తున్నారు. అధికారం ఉంది కదా అని అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే….ఆ తర్వాత కోర్టు మొట్టికాయలు తప్పవని సెటైర్లు వేస్తున్నారు.