ఏపీ సర్కారుపై తాజాగా హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ఒక ఘటనను ఉటంకిస్తూ.. హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇటీవల ఒక కాంట్రాక్టరు తనకు రావాల్సిన బిల్లులు పెండింగులో పడడంతో దొంగగా మారిన ఉదంతాన్ని కోర్టు గుర్తు చేసింది.
దీనిని ఉదాహరణగా పేర్కొంటూ.. పింఛను దారులు `పిక్ పాకెటర్లు`గా మారాలని కోరుకుంటున్నారా? అని హైకోర్టు వ్యాఖ్యానించడం.. ప్రభుత్వానికి నిజంగానే అవమానకర విషయమని అంటున్నారు పరిశీలకులు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. దీనికి ఒకటి ఆర్థిక పరమైన ఇబ్బందులు. రెండు రాజకీయ పరమైన కారణాలు. వాస్తవానికి రెండో కారణం కంటే..ఆర్థిక పరమైన ఇబ్బందే ఎక్కువగా ఉంది.
ఎందుకంటే సొంత పార్టీ వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కొన్నాళ్ల కిందట చెప్పారు. ఇక, తాజా కేసులో ఏకంగా హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది. అయితే.. కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసినా.. ఎంత సంక్షేమం చేసినా.. ప్రజల్లోకి హైకోర్టు వ్యాఖ్యలే బలంగా వెళ్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగింది?
వివిధ పనులు చేసిన తమకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా ఏపీఈడబ్ల్యూఐడీసీని ఆదేశించాలని కోరుతూ విశాఖ జిల్లా నాతవరానికి చెందిన కాంట్రాక్టర్ పీఎన్వీ రమణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. బిల్లులు చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ హాజరుకు ఆదేశించారు.
బిల్లులు చెల్లించేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని ఎండీ దీవన్రెడ్డి కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ… బిల్లులు అప్లోడ్ చేయలేదని, ఆర్థికశాఖ నుంచి సొమ్ము విడుదల కావాలనే సాంకేతిక కారణాలు చెపొద్దన్నారు. హాజరుకు ఆదేశిస్తే తప్ప బిల్లులు చెల్లించరా అని మండిపడ్డారు.
ఆర్అండ్బీలో పనులు చేసిన ఓ కాంట్రాక్టర్ రూ.2.33 కోట్ల బకాయిలు రాక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సొంత మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడినట్లు పత్రికల్లో చదివామన్నారు. ప్రభుత్వం తీరుతో కాంట్రాక్టర్లు దొంగలుగా మారుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకపోతే వృద్ధాప్యంలో మందుల కోసం వారు డబ్బులు ఎక్కడ తెచ్చుకుంటారని నిలదీశారు. పెన్షన్ చెల్లించకుండా వారిని జేబుదొంగలుగా మారుస్తారా? న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.