పీఆర్సీ విషయంలో ఏపీ సర్కార్ వర్సెస్ ఉద్యోగులు అన్న చందంగా వివాదం నడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఎట్టకేలకు కొన్ని డిమాండ్లకు తలొగ్గిన ప్రభుత్వం…ఉద్యోగుల సమ్మెను ఎలాగోలా ఆపగలిగింది. కానీ, కొందరు ఉద్యోగులు మాత్రం తమ జీతాల నుంచి భవిష్యత్తులో ఐఆర్ రికవరీ చేసే చాన్స్ ఉందని కొందరు ఉద్యోగులు అనుమానిస్తున్నారు. కొత్త పీఆర్సీ జీవోల ద్వారా సర్వీసు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తున్నారని, జీతాల నుంచి రికవరీ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ ఏపీ గజిటెడ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య గత నెలలో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి ఐఆర్ రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఉద్యోగం కోసం జీవితాలను ధారపోసిన ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ రికవరీలకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేసింది. పీఆర్సీ జీవోలకు సంబంధించిన ప్రతులన్నీ పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాదు, అసుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు తోపాటు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో, జగన్ సర్కార్ ప్లాన్ బెడిసికొట్టినట్లయిందని కొందరు ఉద్యోగులు అనుకుంటున్నారు.మరి, ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా కౌంటర్ దాఖలు చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.