ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయిన తర్వాత చట్టాలను చట్టుబండలు చేయడం, కోర్టు తీర్పులు బేఖాతరు చేయడం వంటివి సర్వ సాధారణమయ్యాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ కు కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేయడం, అక్షింతలు వేయడం వంటి పరిణామాలు జరిగాయి. అయినా సరే జగన్ సర్కార్ తీరు మారడం లేదనడానికి తాజాగా ఘటనే ఉదాహరణ.
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలి. కానీ, ఏపీలో మాత్రం అలా జరగడం లేదు. పరోక్షంగా ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధి కల్గించేందుకే జగన్ సర్కార్ ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు పరోక్షంగా సాయపడుతోందంటూ మండిపడింది. పేదవిద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడింది.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కల్పించాలని, లేదంటే జైలుకు పంపాల్సి వస్తుందని ఏపీ సీఎస్, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ‘‘విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. లేదంటే మీరు జైల్లో అయినా ఉండాలి’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమంది పేద పిల్లలకు ప్రవేశాలు కల్పించారో చెప్పాలని నిలదీసింది.
ఒకవేళ, ఆ వివరాలతో సంతృప్తి చెందకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని కూడా పేర్కొంది. ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా ఆ వ్యాజ్యంపై విచారణ జరిగిన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments 1