ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. ఇప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు తీసిపోని విధంగా సాగిన పంచాయితీ ఎన్నికల పంచాయతీ చివరకు హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకంగా షెడ్యూల్ విడుదల చేయగా…ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమంటూ ప్రభుత్వం, ప్రభుత్వుద్యోగులు…మంకుపట్టు పట్టారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసింది. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసిన హైకోర్టు…వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాకూడదని అభిప్రాయపడింది. ప్రజారోగ్యం, కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.
కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరపాల్పిన అధికారులు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంపై దృష్టి పెట్టారని ప్రభుత్వం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు ప్రతికూలంగా లేవని ఎస్ఈసీ చెబుతోంది. ఏపీ ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేసింది. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ డివిజినల్ బెంచ్‌కు వెళ్తుందా? లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.