ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీలో రహదారులపై రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా తెచ్చిన ఈ జీవోపై ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే జగన్ నియంతృత్వ పోకడలను ప్రతిపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆ జీవోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టు ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గతంలో ఆశ్రయించారు. దీంతో, ఆ జీవోను నిలిపివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీవో నెంబర్ 1 పై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఆ తర్వాత ఈ వివాదాస్పద జీవోపై విచారణను ఏపీ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో పూర్తి చేసింది. కానీ, తీర్పును మాత్రం రిజర్వ్ లో ఉంచింది. దీంతో, ఆ అంశంపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.1పై వీలైనంత త్వరగా తీర్పు వెలువరించాలని హైకోర్టును సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. పోలీస్ యాక్ట్ 30కి భిన్నంగా ఈ జీవో ఉందని, రోడ్ షోలను కట్టడి చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా జీవో నెం.1 ఉందని, అందుకే దానిని సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా తీర్పుతో జగన్ సర్కార్ కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైనట్లయింది.