ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసినప్పటికీ…దానికి అనుబంధంగా ఉన్న పంచాయతీలు ఇంకా తేలలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నించగా….వ్యాక్సినేషన్ సాకుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సుప్రీం కోర్టు జోక్యంతో ఈ పంచాయతీకి తెరపడి ఆ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.
అయితే, ఇటు ప్రభుత్వం…అటు ఎస్ఈసీకి మధ్య నలిగిపోయిన అధికారులు…వారిపై ఉన్న కేసులు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే తమకు మాజీ సీఎస్ నీలం సాహ్నీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సహకరించలేదంటూ గతంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తాజాగా మూడోసారి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. నీలం సాహ్నీ, గోపాలకృష్ణ ద్వివేది మార్చి 22న తమ ఎదుట హాజరుకావాలంటూ హైకోర్టు ఆదేశించింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసిన హైకోర్టు…. తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదా వేసింది.
పంచాయతీ ఎన్నికల విషయంలో తనకు సహకరించని ప్రభుత్వ అధికారులపై నిమ్మగడ్డ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు తమకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నీలం సాహ్ని, ద్వివేది తమకు ఏమాత్రం సహకరించడం లేదని, కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై గతంలోనే రెండుసార్లు విచారణ చేపట్టిన హైకోర్టు….తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నీలం సాహ్ని, ద్వివేది కోర్టుకు రావాలని ఆదేశించింది. మరి, ఈ వ్యవహారంపై జగన్ సర్కార్, నీలం సాహ్ని, ద్వివేదిల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.