ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు మరోసారి షాకిచ్చింది. మరో 2 రోజుల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్న ఏపీ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలిపివేయాలంటూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1న ఏపీ ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేనందున తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు మధ్య 4 వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.
పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ముందు నుంచి చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారని, పార్టీలను సంప్రదించలేదని, సుప్రీం ఆదేశాలను పాటించలేదని చంద్రబాబు చెప్పినా…వైసీపీ సర్కార్ చెవికెక్కించుకోలేదు. దీంతో, తప్పని సరి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇక, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ జనసేన, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే ఏపీ సర్కార్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైకోర్టు తాజా తీర్పు జగన్ సర్కార్ కు చెంపపెట్టువంటిదని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. మరి, ఈ తీర్పుపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళుతుందో లేదో వేచి చూడాలి. గతంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై నిమ్మగడ్డ రమేష్ కు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లిన జగన్ సర్కార్ కు చుక్కెదురైన సంగతి తెలిసిందే.