అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని నోటీసులలో సీఐడీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును లోకేష్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటీసుల వ్యవహారంపై లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు లోకేష్ కు భారీ ఊరటనిచ్చింది. సీఐడీ విచారణను ఈ నెల 10కి కోర్టు వాయిదా వేస్తూ సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ అని, తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని కోర్టుకు తెలిపారు. లోకేష్‌ను వాటి గురించి అడగడం సమంజసం కాదని పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. అయితే, ఆ డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, ఈ నెల 4న విచారణకు హాజరుకావాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. అయితే, అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. దీంతో, ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని లోకేష్ ను హైకోర్టు ఆదేశించింది. అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయాలని ఆదేశించింది. లోకేష్ తరఫు న్యాయవాదిని అనుమతించాలని, మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు, ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ కోరారు. అయితే, లోకేష్ ను నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ ప్రకారం నోటీసులు ఇస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది వెల్లడించారు.