ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఇదే విషయంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు గతంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అయినప్పటికీ పోలీసుల తీరు మారడం లేదని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తనపై ఏపీ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ అయిన తనపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారంటూ న్యాయపోరాటానికి దిగారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్సీ అయిన అనితపై ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా నమోదు చేస్తారని ఏపీ పోలీసులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. అనిత ఎస్సీ అయితే ఈ కేసు కొట్టివేయాలని ఆదేశించింది. కాగా, పులివెందులలో ఎస్సీ యువతి అత్యాచారం, హత్య నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా ఉన్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలోనే అనితపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.
దీంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించగా…పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల నమోదు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, పులివెందులతోపాటు అమరావతి తదితర ప్రాంతాలలో కూడా ఈ తరహా కేసులు పెట్డడంపై విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా, కేసులు నమోదు చేసే విషయంలో పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.