ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఒకవైపు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ నే.. మరోవైపు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ… లెక్కకు మించిన రీతిలో సలహాదారులను నియమిం చుకుంటోంది. ఒకవైపు న్యాయవ్యవస్థ నుంచి సాధారణ ప్రజలనుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూడా .. ప్రభుత్వం తనమానాన తను సలహాదారులను నియమించుకుంటూనే ఉంది.
తాజాగా ఈ పరిణామంపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలానే చూస్తూ ఊరుకూంటే.. తహశీల్దార్‌కు కూడా సలహాదారును నియమిస్తారేమో! అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై ఏదో ఒకటి తామే తేల్చేస్తామని పేర్కొంది. దేవాదాయశాఖతో పాటు వివిధ శాఖల్లో ప్రభుత్వ సలహాదారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. “ఇలాగే వదిలేస్తే తహశీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారేమో“నని వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులు ఉండగా వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి సంబంధించి రాజ్యాంగబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ప్రభుత్వ సలహదారులకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గతంలో దేవాదాయశాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. స్టే ఉత్తర్వుల్లో సవరణ చేసి ఆయన సలహదారు పదవిలో కొనసాగేందుకు అనుమతిచ్చింది. సలహదారుల నియామకంపై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పరిణామం ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.