ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరిట లభించింది. పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు సంబంధించి ఆయనకు అనుకూలంగా తీర్పు వెల్లడైంది. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం సెప్టెంబర్ 3న సతీసమేతంగా జగన్ లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 25 వరకు లండన్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే జగన్ పాస్‌పోర్ట్ కష్టాలు చుట్టుముట్టాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ ద్వారా జగన్ విదేశాలకు వెళ్లేవారు. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లోమాట్ పాస్‌పోర్టు కూడా రద్దు అయింది. దాంతో ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు నుంచి ఎన్వోసీని తేవాలని పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు కోరారు. అందుకోసం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయగా.. కేవలం ఒక ఏడాది మాత్రమే పాస్‌పోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ అయింది. అలాగే స్వయంగా హాజరై రూ. 20వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని షరతులు విధించింది.
విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తన పాస్‌పోర్టును ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని.. సీబీఐ కోర్టు కూడా అందుకు అనుమతి ఇచ్చిందని పిటిషన్లో ప్రస్తావించారు. విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రెన్యూవల్ టైమ్ ను ఐదేళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. దీంతో జగన్ లండన్ టూర్ కు లైన్ క్లియర్ అయింది.