గ్రూప్-1 పరీక్షలో డిజిటల్ మూల్యాంకనంపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈ విధానం వల్ల అర్హులైన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్ది రోజుల క్రితం మండిపడ్డ సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేశారని, ఏపీపీఎస్సీలో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని కొద్ది రోజుల క్రితం లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. 9,678 క్వాలిఫైడ్ అభ్యర్థుల్లో 340 మందినే ఇంటర్వ్యూకు పిలిచారని, కనీస విద్యార్హత లేని వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారని లోకేశ్ విమర్శించారు.
గ్రూప్-1 పరీక్షల డిజిటల్ మూల్యాంకనం ఏ రాష్ట్రంలో అమలవుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 జోలికొస్తే ఏ1రెడ్డికి ఎలా బుద్ధిచెప్పాలో తమకు తెలుసని, ఎవరూ అధైర్యపడొద్దని అభ్యర్థులకు లోకేశ్ ధైర్యం చెప్పారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీని గుండు సున్నా చేశారని, పోలీస్ రిక్రూట్మెంట్ను నిర్వీర్యం చేశారని లోకేశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లోకేశ్ వ్యాఖ్యలను సమర్థించే రీతిలో ఏపీ హైకోర్టు గ్రూప్-1 పరీక్షలపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా…వాటిపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి కోర్టు ఆదేశాలిచ్చింది. తాజా తీర్పుపై నష్టపోయిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదో తరగతి పరీక్షల వాయిదాపై కూడా లోకేశ్ అలుపెరుగని పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు గ్రూప్-1 విషయంలోనూ లోకేశ్ ఆవేదనకు అనుగుణంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంపై యువత హర్షం వ్యక్తం చేస్తోంది. జగన్ పై లోకేశ్ మరో విజయం సాధించారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.