సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ, టీడీపీకి, జనసేనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న పంచ్ ప్రభాకర్ పలు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కోర్టులపైనా, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పంచ్ ప్రభాకర్ పోస్టులు పెట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జిలపై వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో పంచ్ ప్రభాకర్ పై పలు కేసులు నమోదు కాగా…సీబీఐ విచారణ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాకర్ ను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని హైకోర్టు నిలదీసింది. పంచ్ ప్రభాకర్ కు ఒక్క నోటీసు కూడా సీబీఐ అధికారులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో సీబీఐ ఎస్పీని కోర్టుకు పిలిపించిన ధర్మాసనం…వివరణ కోరింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తాజాగా నేడు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్ట్ చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఒకవేళ సీబీఐకి చేతకాకుంటే సిట్ ఏర్పాటు చేస్తామని షాకింగ్ కామెంట్లు చేసింది. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా నివేదికనిస్తామని తేల్చి చెప్పింది. ఆల్రెడీ కొనసాగుతోన్న దర్యాప్తు పురోగతిపై కూడా నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. అలా చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేతకాదని భావించి సిట్ ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పింది.
విచారణలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పోస్టులను డిలీట్ చేయాల్సిన పని లేదా? అని ప్రశ్నించింది. పోస్టులు పెట్టిన రెండేళ్ల తర్వాత వాటిని తొలగిస్తే ఏం ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ ప్రకారం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో వైసీపీ తరఫున యాక్టివ్ గా ఉంటూ విపక్ష పార్టీలు, విపక్ష నేతలపై విషం చిమ్మడమే పంచ్ ప్రభాకర్ నైజం. అయితే, పార్టీపై, విపక్ష నేతలపై చేసినట్లుగానే కోర్టులు, జడ్జిలు, తీర్పులపై కూడా ఇష్టం వచ్చినట్లు అసభ్యకర పోస్ట్ లు పెట్టాడు పంచ్ ప్రభాకర్. అయితే, ఆ అసభ్యకర పోస్టులపై అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే దానిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు..కీలక ఆదేశాలు జారీ చేసింది.