బిగ్‌బాస్ రియాల్టీ షోపై కొందరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. యువతను పక్కదారి పట్టించేలా బిగ్‌బాస్ కంటెంట్ ఉందని.. వల్గారిటీని ప్రోత్సహించేలా ఈ షో ఉందని పలువురు విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎవరికి ఉపయోగమో నిర్వాహకులు సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ చాలాకాలం క్రితం చేసిన కామెంట్లు దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే యువతను పక్కదారి పట్టించేలా బిగ్‌బాస్ ఉందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఆ పిల్ తాజాగా నేడు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీన్ని అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు రిక్వెస్ట్ చేశారు. దీంతో, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి. రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేస్తామని వెల్లడించింది.
ఈ సందర్భంగా బిగ్‌బాస్ షోపై హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. మంచి పిల్ వేశారని పిటిషనర్‌కు కితాబిచ్చిన ధర్మాసనం… 2019లో పిల్ వేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాసెస్ జరగలేదా అని న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే, దీనిపై ప్రాసెస్ జరగలేదని న్యాయవాది సమాధానమిచ్చారు. ఈ షోపై ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని తాము అనుకుంటున్నామని, ఈ పిల్ రూపంలో స్పందన వచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అసభ్యతను, అశ్లీలతను పెంచుతున్నాయని, తమ పిల్లలు బాగున్నారు కదా ఇలాంటి కార్యక్రమాలతో తమకేం పని అని ప్రజలు భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా ఇతరుల సమస్యలు గురించి పట్టించుకోకుంటే… మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోరని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే, ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని వెల్లడించింది.