కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు కొద్ది నెలల క్రితం శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో శిక్ష తప్పింది. దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో సేవ చేయాలని తీర్పు చెప్పింది. అయినా సరే కొందరు ఐఏఎస్ ల తీరు మాత్రం మారలేదు.
ఈ క్రమంలోనే తాజాగా కోర్టు ధిక్కరణ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. తమ తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీలోని ఇద్దరు ప్రభుత్వ కార్యదర్శులపై ఏపీ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కరణ కేసుల్లో పదేపదే న్యాయస్థానానికి వారు వస్తున్నారని, వారిని చూడాలంటేనే చికాకుగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో వీరిద్దరూ ఇప్పటికే దాదాపు 70 సార్లు కోర్టు మెట్లు ఎక్కడంతో హైకోర్టు ఈ రకంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, దేశంలో మరే రాష్ట్రంలో నమోదు కానన్ని కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తే తప్ప కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టులంటే ఐఏఎస్ లకు, ప్రభుత్వ కార్యదర్శులకు లెక్కలేదా లేదంటే బరితెగింపా అని హైకోర్టు చీఫ్ జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.