ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తోందంటూ రాష్ట్రపు అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు అక్షింతలు వేసింది. ఇక, ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకున్న పలువురు ఐఏఎస్ లు సైతం కోర్టు ముందు హాజరు కావాల్సి రావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ పై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో రైతు భరోసా, పంచాయితీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని తాము ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని హైకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కరణ కేసుపై విచారణ జరిపిన అత్యున్న న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కారం కేసులో నలుగురు ఐఏఎస్‌లు, పంచాయితీ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్వేది, కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీ, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టులో హాజరైన సందర్భంగా హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
పేద పిల్లలు చదువుకునే పాఠశాలల వాతావరణ కలుషితం చేస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీలో ఎవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా’ అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ ఎందుకు నిర్మాణాలు కొనసాగుతున్నాయని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసింది. పాఠశాలల ఆవరణలోకి రాజకీయాలను ఎందుకు తీసుకెళ్తారని ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆగస్టు 31న కూడా ఈ రోజు హాజరైన అధికారులంతా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారంలో అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమగ్ర నివేదిక ఇస్తామని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.