జాతీయ ఉపాధి హామీ పథకం… నరేగా బకాయిల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వంపై గతంలో హైకోర్టు మండిపడిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకుంటే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు హాజరు కావాలని గత నెల 16వ తేదీన సంచలన ఆదేశాలిచ్చింది. సుమారు రూ.2500 కోట్ల నరేగా నిధులు పెండింగ్లో ఉండడంపై విమర్శలు వచ్చాయి.
అయితే, గడువులోగా బిల్లులు చెల్లించకపోవడంతో ఈ వ్యవహారంపై నేడు మరోసారి విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సర్కార్ పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని అసహనం వ్యక్తం చేసింది. నెల రోజుల్లో బిల్లులు చెల్లించాలని గత ఏడాది జనవరి 8న కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.
కేంద్రం నుంచి నిధులు రావాల్సి సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించింది. విజిలెన్స్ నివేదికను అధ్యయనం చేయకుండా విచారణకు హాజరైన గోపాలకృష్ణ ద్వివేదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టుకు హాజరు కాకపోవడంపై ఎస్జీపీ క్షమాపణలు చెప్పారు. కోర్టు ఆదేశాలు గౌరవించేది ఇలాగేనా అంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం చెప్పే లెక్కలు వినేందుకు తాము సిద్ధంగా లేమని, కోర్టు ఆదేశాలు అమలు చేశారా? లేదా? అనేదే ముఖ్యమని స్పష్టం చేసింది.
తాము చర్యలకు ఉపక్రమించేందుకు సమయం ఆసన్నమైందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ఆ రోజు పంచాయతీ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తప్పక హాజరుకావాలని, కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది.