వైసీపీ అధ్యక్షడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాస్‌పోర్టు కష్టాలు వీడాయి. ఎలాగైతేం పంతం నెగ్గించుకుని త్వరలోనే లండన్ కు పయనం కాబోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి జగన్ కూతురు లండన్ లో చదువుకుంటోంది. నిజానికి 2024 ఆగస్టులో కూతురి పుట్టినరోజు వేడుకలకు జగన్ దంపతులు లండన్ వెళ్లాలనుకున్నారు. సీబీఐ కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. కానీ పాస్‌పోర్టు లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్లమాట్ పాస్పోర్టుతో విదేశాలు వెళ్లొచ్చేవారు. పదవి పోవడంతో ఆ పాస్‌పోర్టు రద్దు అయింది.
దాంతో ఐదేళ్లకు రెగ్యులర్ పాస్‌పోర్టు జారీ చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. అయితే 20వేల పూచీకత్తుతో పాటు ప్రత్యక్షం హాజరుకావాలని వైఎస్ జగన్‌కి గతంలోనే విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ అలా దిగువ కోర్టులో ప్రత్యక్షంగా హాజరై పూచికత్తు ఇవ్వడం నామోషీగా భావించిన జగన్ తన లండర్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.
అయితే ఈ నెల 16న జగన్ కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవం జరగబోతోంది. కుమార్తె గ్రాడ్యుయేషన్ ఉందన్న పేరుతో జగన్ మళ్లీ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారైనా కింది కోర్టుకు వెళ్లి పూచికత్తు సమర్పిస్తే పోయేది. కానీ అందుకు అంగీకరించని జగన్..హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. ఫైనల్ గా దిగువ కోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయించుకుని అనుకున్నది సాధించారు. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివసారెడ్డి దిగువకోర్టు ఉత్తర్వుల్ని కొట్టేసి జగన్ అభ్యర్థలకు ఆమోదం తెలిపారు. ఐదేళ్ల పాస్ పోర్టు జారీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జగన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇక త్వరలోనే సతీమణి భారతితో కలిసి జగన్ లండన్ కు పయనమవబోతున్నారు.