అప్పు చేసి మరీ పప్పు కూడు తినడం అంటే..ఏపీలోనే చూడాలని అంటున్నారు నెటిజన్లు. ఒకవైపు లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తున్న ఏపీలోని జగన్ ప్రభుత్వం.. ఆ నిధులను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించడం లేదనే విమర్శలు ఉండనే ఉన్నాయి. పోనీ.. ఈ కోట్లకు కోట్ల అప్పులతో ఏమైనా అభివృద్ధి పనులు చేపడుతున్నారా? అంటే.. అది కూడా కనిపించడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు అప్పులుగా తెచ్చిన కోట్ల రూపాయల సొమ్మును అధికారులకు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి వినియోగించడం మరింత వివాదంగా మారింది.
రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల అధికారులు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశారు సీఎం జగన్. అధికారిక కార్యక్రమాల కోసం సాధారణ పరిపాలన శాఖలోని ప్రోటోకాల్ విభాగం నిర్దేశించిన వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉన్నా… కొంతమం ది వీటిని బేఖాతరు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు విభాగాధిపతులు కియా కార్నివాల్ వంటి కార్లను అధికారిక అవసరాల కోసం కొనుగోలు చేయడం వివాదాస్పదం అవుతోంది.
ప్రభుత్వానికి పనులు చేసిన కాంట్రాక్టర్లతో పాటు చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు.. వేలు, లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు నానా ఇబ్బందులు పెడుతున్న అధికారులు.. అప్పులు తెచ్చిన నిధులతో విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హోదాతో సంబంధం లేకుండా అధికారులకు విలాసవంతమైన కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు నెటిజన్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రోటోకాల్ రీత్యా న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టు న్యాయమూర్తులకు సరైన వాహనాలు లేకపోవటంతో వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులకు మాత్రమే కొనుగోలు చేయాల్సిన ఈ తరహా వాహనాలు ఇప్పుడు హోదాతో సంబంధమే లేకుండా కొందరు ఆధికారులు ఆయా శాఖల నిధులతో కొనుగోలు చేస్తుండటం వివాదాస్పదం అవుతోంది.