58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు వారి స్వతంత్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన పొట్టి శ్రీరాములును వైసీపీ పార్టీ అవమానించిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలు ఒడ్డి తెచ్చిన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి విలువ లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలను రాజధాని లేని ప్రజలుగా చేశారన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించడం కోసం 58 రోజుల ఆమరణ దీక్ష చేసి ఇదే రోజున అమరులయ్యారు పొట్టి శ్రీరాములుగారు. ఆయన సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది’ అని వ్యాఖ్యానించారు.
‘ఆనాడు పొట్టి శ్రీరాములు గారు చేసిన అహింసాయుత పోరాటం మనకు స్ఫూర్తి అవ్వాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని సాధించుకున్ననాడే ఆ అమరజీవి ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ త్యాగధనుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.