`నేరం నాది కాదు.. ఆకలిది!` అనే సినిమా డైలాగు గుర్తుందా? ఇప్పుడు అచ్చం అలానే.. ఒక కాంట్రాక్టర్ దొంగగా మారాడు. ఈయన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. “నేరం నాది కాదు.. ప్రభుత్వానిది!“ అనే చెపుతున్నాడు. ఎందుకంటే.. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినా.. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగులో పెట్టడంతో దిక్కుతోచక.. అయిన వారి ఇంట్లోనే చోరీ చేయాల్సిన పరిస్థితి సదరు కాంట్రాక్టర్‌కు పట్టింది. ప్రభుత్వ ఉదాసీనత, బిల్లుల చెల్లింపులో జాప్యం.. వెరసి.. వైట్ షర్టు నలగకుండా.. పనులు చేయించిన కాంట్రాక్టర్ నేడు.. ఊచలు లెక్కపెట్టే పరిస్థితికి చేరుకున్నాడు.
ఎవరు ఏంటా కథ!
క్రాంతి కిరణ్ అనే వ్యక్తిని ఒంగోలు పోలీసులు దొంగతనం నేరంపై అరెస్టు చేశారు. అయితే.. ఈయన ఎందుకు దొంగగా మారాడు.. ఈ పరిస్థితి ఎలా వచ్చింది.. అనే విషయాలను గమనిస్తే.. నిర్ఘాంత పోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి. కిరణ్.. జలవనరుల శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బి శాఖల్లో కాంట్రాక్ట్ పనులు చేసేవాడు. 2019 నుంచి వివిధ ప్రాంతాల్లో మొత్తం రూ.2.70 కోట్ల విలువైన పనులు చేశాడు.
అయితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును పక్కన పెట్టింది. దీంతో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కిరణ్ అప్పుల పాలయ్యాడు. దీనికితోడు మద్యానికి బానిసయ్యాడు. అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరగడం, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో చివరకు చోరీకి తెగబడ్డాడు.
అయిన వారి ఇంట్లోనే!
క్రాంతి కిరణ్ చోరీకి పాల్పడింది అయిన వారి ఇంట్లోనే కావడం గమనార్హం. సొంత మేనత్త ఇంట్లోనే ఈ చోరీ చేశాడు. ఒంగోలు దేవుడి చెరువు ఏరియాలో నివాసం ఉండే వరికుంట్ల వెంకటకృష్ణ టీచర్. ఆయన భార్య భ్రమరాంబ కూడా అద్యాపకురాలే. ఈ క్రమంలో రూ.52 లక్షలు ఇంట్లోనే ఉంచారు. ఇదిలావుంటే, డిసెంబరు 26న భ్రమరాంబ మార్కాపురంలోని తన తమ్ముడి ఇంటికి వెళ్లారు. మాటల సందర్భంలో భ్రమరాంబ తాను స్థలం కొనుగోలు కోసం ఇంట్లో డబ్బులు దాచానని చెప్పింది.
అదేసమయంలో అక్కడ ఉన్న కాంట్రాక్టర్ క్రాంతి కిరణం.. మేనత్త చెప్పిన మాటలు విన్నాడు. దాదాపు 52 లక్షలు. కావడంతో ఆ నగదుపై ఆశ పుట్టింది. పోనీ.. అడిగితే ఇస్తారా? అంటే ఇవ్వరు. దీంతో దొంగతనమే బెటర్ అనుకున్నాడు. ఈ క్రమంలో గతనెల 28న ఒంగోలుకు వచ్చి ఓ లాడ్జిలో మకాం వేశాడు. గత నెల 31న చీమకుర్తికి చెందిన నాగరాజు అనే డ్రైవర్‌కు ఫోన్ చేసి కారు తెప్పించుకున్నాడు.
అనంతరం, ఒంగోలు బండ్ల మిట్టలో రంపపుమిషన్ కొన్నాడు. మధ్యాహ్నం కారులో దేవుడుచెరువు ఇంటికి వెళ్లి తలుపులు కోసి గడియ తీశాడు. లోపలికి వెళ్లి నగదు ఉన్న రెండు బ్యాగ్‌ల్లో డబ్బులు తీసుకుని పారిపోయాడు.
ఎలా బయట పడిందంటే..?
డిసెంబర్ 31న ఇంటికి వచ్చిన వెంకటకృష్ణ.. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. తర్వాత చూస్తే ఇంట్లో డబ్బులు మాయం అయ్యాయి. వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. దీని ఆధారంగా.. క్రాంతి కిరణ్‌ను అరెస్టు చేసి.. సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇదీ.. సంగతి!!