- 16 కొత్త కాలేజీల్లో సర్దుబాటెలా?
- పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు ఏరీ?
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకూ కొరత
- 4,400 మంది వైద్యులు అవసరం
- మొత్తం 17 వేల మంది సిబ్బంది కావాలి
- ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల్లో జీతం
- ప్రభుత్వ సేవలకు వెనకడుగు
- అసలు సమస్య పట్టించుకోకుండా
- జగన్ సర్కారు ఆర్భాటం
- ఇతర కార్యాలయాల భూములిచ్చి
- లేనిపోని వివాదాల సృష్టి
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలపై జగన్ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో.. ఎంటెక్ అర్హత ఉన్న వారితో పాఠాలు చెప్పించవచ్చు. అందులో నాణ్యత, ప్రమాణాలు ఎలా ఉన్నా… విద్యార్థులు పట్టాలు పుచ్చుకుని బయటికి వచ్చేస్తారు. కానీ వైద్య విద్యార్థుల విషయంలో ఇలాంటి ‘ఉత్తుత్తి’ చదువు కుదరనే కుదరదు.
హైదరాబాద్‌కు ‘మెడికల్ హబ్’గా పేరు. అక్కడే వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ సమస్య నెలకొంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే 15 శాతం వరకూ సిబ్బంది కొరత ఉంది. దీనిని గమనించకుండా, కొత్త ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తారో గుర్తించకుండా… ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు పెడతామని హడావుడి చేస్తున్నారు.
కొన్నిటికి శంకుస్థాపన కూడా చేశారు. అసలు వాటికి భూములే లేవు. వేరే ప్రభుత్వ సంస్థలకు చెందిన భూములను కేటాయించి వివాదాస్పదం చేశారు. కోర్టులో కేసులున్నా శంకుస్థాపనలు చేసేశారు. నిధుల కోసం రకరకాల గిమ్మిక్కులు చేస్తూ… ఆరోగ్యశ్రీ, బీమా పథకాలకు తూట్లు పొడుస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే.. అసలు కొత్త మెడికల్ కాలేజీల్లో పాఠాలు చెప్పేందుకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారా? ఈ అంశం అన్నింటికీ మించి కలవర పెడుతోంది. ఎందుకంటే.. ఇప్పుడు ఉన్న బోధనాస్పత్రులనే సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.
కొత్తగా ఏర్పాటు చేస్తామంటున్న 16 మెడికల్ కాలేజీలకు 4,400 మంది వైద్యులు, 5,000 మంది నర్సింగ్, 8 వేల మంది పారామెడికల్ సిబ్బంది…. మొత్తం 17,000 మంది అవసరం. ఈ స్థాయిలో నియామకం సాధ్యమేనా అని వైద్య నిపుణుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నవాటికే దిక్కులేదు..
ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ఏలూరు, విజయనగరం తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి. వీటిలో ఎఫ్‌ఎన్‌వోల నుంచి ప్రొఫెసర్ల వరకూ తీవ్రమైన సిబ్బంది కొరత వేధిస్తోంది.
ప్రతి మెడికల్ కాలేజీలోనూ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ప్రొఫెసర్ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈకాలేజీల్లో 550 మంది ప్రొఫెసర్లు, 554 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 1,919 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఐదు వేల మంది స్టాఫ్ నర్సులు, 6,500 మంది పారా మెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
అదనంగా మరో 15 శాతం సిబ్బంది అవసరం ఉంది. మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహించేందుకు ప్రతి రెండుమూడేళ్లకోసారి వైద్యుల నియామకాలు చేపడుతూనే ఉన్నారు. కానీ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ కావడం లేదు. ఏడాది క్రితం డీఎంఈ అధికారులు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, కొత్త మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కొత్తగా 16 మెడికల్ కాలేజీలు నిర్మిస్తానంటోంది. వీటికి రాష్ట్రంలో సిబ్బంది దొరికే పరిస్థితి ఉందా?
రూ.50-55 వేల జీతానికి వస్తారా?
సాధారణంగా ఒక కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు భవనాల నిర్మాణాలతో వైద్య పరికరాలు, ఫ్యాకల్టీ చాలా ముఖ్యం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రచారం 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న మెడికల్ కాలేజీకి 275 మంది బోధనా సిబ్బంది అవసరం.
150 ఎంబీబీఎస్ సీట్లకు 302 మంది, 200 ఎంబీబీఎస్ సీట్లకు 342 మంది, 250 ఎంబీబీఎస్ సీట్లకు 364 మంది బోధనా సిబ్బంది కావాలి. మన రాష్ట్రంలో నిర్మిస్తున్న 16 బోధనాస్పత్రుల్లో ఎక్కువగా ఎంబీబీఎస్ సీట్లతోనే ప్రారంభం కానున్నాయి.
సగటున వంద సీట్లు చొప్పున లెక్కిస్తే, 4,400 మంది బోధనా సిబ్బంది(వైద్యులు) అవసరం. కొత్త మెడికల్ కాలేజీల్లో 10 క్లినికల్ విభాగాలుంటే, 16 నాన్ క్లినికల్ విభాగాలుంటాయి. ప్రతి విభాగానికి ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కచ్చితంగా ఉండాలి.
ఈ లెక్కన కొత్త మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహించేందుకు 1,000 మంది ప్రొఫెసర్లు, 1,500 మంది వరకూ అసోసియేట్ ప్రొఫెసర్లు, 3,000 వేల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. రాష్ట్రంలో ఈ స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నారా అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ వైద్యులు ఎక్కువ మంది ఉన్నా.. పీజీ, స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక వేళ పీజీ, స్పెషాలిటీ పూర్తి చేసిన వైద్యులున్నా.. ప్రభుత్వ సర్వీసులోకి వచ్చేందుకు మొగ్గు చూపే పరిస్థితి లేదు. ఒక కార్డియాలజి్స్టకు ప్రైవేటు సెక్టార్లో నెలకు రూ.3-4 లక్షల వరకూ ఆదాయం వస్తోంది.
ప్రభుత్వ సెక్టార్లో నెలకు రూ.50-55 వేలు మాత్రమే సర్కారు ఇస్తోంది. ఈ జీతాలు చూసి స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవ్వరూ ప్రభుత్వ సర్వీ్‌సలోకి వచ్చే పరిస్థితి ఉండదు.
పట్టణాలకు దూరంగా ఉంటే.. వస్తారా?
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నిలుపుకోవడానికి ఆరోగ్యశాఖ ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యం ఉపయోగించే ట్రిక్‌ను అమలు చేస్తోంది. ఎన్ఎంసీ తనిఖీల సమయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు బయటి నుంచి కొంత మంది ఫ్యాకల్టీని తీసుకొస్తాయి.
తనిఖీలు పూర్తయిన వెంటనే ఆ ఫ్యాకల్టీకి కొంత డబ్బులిచ్చి వెనక్కి పంపించేస్తాయి. వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ ఫ్యాకల్టీని తనిఖీల సమయంలో పంపిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం, అనంతపురం, కడప, ఒంగోలు బోధనాసుపత్రుల్లో విధులు నిర్వహించేందుకు ఫ్యాకల్టీ మొగ్గు చూపడం లేదు.
ఈ నాలుగు కాలేజీలు ఆయా జిల్లాల్లో నగరాలకు సమీపంలోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం కొత్తగా నిర్మించే కాలేజీలు పట్టణాలకు సుదూరంగా ఉన్నాయి. పాడేరు గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా పల్లెల్లో నిర్మించే బోధనాస్పత్రుల్లో విధులు నిర్వహించేందుకు స్పెషాలిటీ వైద్యులు ముందుకొచ్చేది అనుమానమే.
కొత్త కాలేజీలకు ఎదురైయ్యే మరో ప్రధాన సమస్య నర్సుల కొరత. ప్రస్తుతం ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో ఎన్ని పడకలు ఉంటే అంత మంది నర్సింగ్ సిబ్బంది కచ్చితంగా ఉండాలి. సాధారణంగా 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న మెడికల్ కాలేజీల్లో కనీసం 300 పడకల ఆస్పత్రి ఉండాలి.
దీని ప్రకారం ప్రతి బోధనాస్పత్రిలో 300 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా బోధనాస్పత్రుల్లో ఒక వార్డుకు ఒక నర్సు ఉన్నారు. ఒక వార్డులో కనీసం 15-20 పడకలుంటాయి.
ఇక రాత్రి పూట రెండు, మూడు వార్డులకు కలిపి ఒక్క నర్సుకే విధులు అప్పగిస్తున్నారు. 16 కొత్త మెడికల్ కాలేజీలకు 5,000 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. వీరికితోడు పారా మెడికల్ సిబ్బందిని అదనంగా నియమించుకోవాలి.
ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో 6,500 మంది పారా మెడికల్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 16 కొత్త కాలేజీలకు అదనంగా మరో 8,000 వేల మంది పారా మెడికల్ సిబ్బంది అవసరం. ప్రస్తుతం పారా మెడికల్ బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. పారా మెడికల్ కోర్సులను ప్రభుత్వం గాలికి వదిలేసింది.
ఈ కోర్సులకు ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. పారా మెడికల్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆయా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తెలంగాణకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.