రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని.. రాజ్యాంగం అంటే.. తమకు ఎనలేని గౌరవమని పదే పదే చెప్పుకొనే ఏపీ సర్కారు పెద్దలు అదే రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను మాత్రం గుర్తించలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
సాధారణంగా.. దేశవ్యాప్తంగా ఎక్కడైనా.. పాలకులు తప్పులు చేసినా.. వారి నిర్ణయాల్లో లోపాలు ఉన్నా.. ఎత్తి చూపడం అనేది పౌర సమాజం సహజంగా చేసే ప్రక్రియ. నిజానికి విమర్శలే.. ప్రభుత్వానికి దిక్సూచి వంటివని గత పాలకులు భావించారు. కానీ, ఇప్పుడు ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది.
ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై రాజద్రోహం, కుట్ర, కుతంత్రం, ప్రభుత్వాన్ని కూలదోయడం వంటి కేసులు పెడుతూ.. వేధిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, అధికారులకు కూడా కరోనా అడ్డు వస్తోంది. కానీ, అదేసమయంలో ప్రభుత్వంపై ఎవరైనా చిన్న విమర్శ చేసినా.. తట్టుకోలేక పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు వందలాది మంది యువత, నేతలపై కేసులు నమోదు చేశారు. అరెస్టు లు చేసి జైళ్లకు కూడా తరలించారు. ఈ విషయంలో న్యాయ నిపుణుల నుంచి కోర్టుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా కూడా పాలకులు లెక్కచేయడం లేదు.
తాజాగా గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని కుంకలగుంటకు చెందిన పి.అశోక్, జి.నిరీక్షణరావును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వీరిద్దరూ ఫేస్బుక్లో అభ్యంతరకమైన పోస్టులు పెట్టారని పోలీసులు పేర్కొనడం గమనార్హం. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేశామన్నారు.
వాస్తవానికి ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తట్టుకోలేక పోతుండడం.. అంతా బాగుందనే ప్రచారం చేసుకోవడమే ప్రధానంగా సర్కారు అడుగులు వేస్తోందని నిపుణులు సైతం విమర్శలు సంధిస్తున్నారు. అయినప్పటికీ.. సర్కారులో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.