అమరావతి భూ కుంభకోణంపై వివిధ చానళ్లలో వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం స్పందించారు.
ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం.. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది – సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారు – ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారు – ఈ ఏడాది జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.. ఆ వెంటనే ఏకంగా ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయి – ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారు అని అజేయకల్లం సంచలన ఆరోపణ చేశారు.
సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామలు మారిపోయాయి – చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన కేసులన్నీ జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారయణమూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రమేష్ బెంచ్ కు మారిపోయాయి అన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రతి పిల్ ను అనుమతించడమే కాకుండా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి దాఖలైన FIRలపై ఏపీ హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడటంలో జస్టిస్ లలిత ముందుంటున్నారు. ESI స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు సంబంధించి న్యాయసూత్రాలకు విరుద్ధంగా జస్టిస్ లలిత వ్యవహరించారు. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చాలని నిర్ణయించినప్పుడు ఏపీ హైకోర్టు అడ్డుకుంది అని కల్లం ఆరోపించారు.