ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో, హుటాహుటిన హరిచందన్ ను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. అనంతరం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మధ్యాహ్నం 1 గంటకు చేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ప్రకారం ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ప్రస్తుతం గవర్నర్ కు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వారు వెల్లడించారు. హరిచందన్ ఆరోగ్యాన్ని వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. ఇటీవల గవర్నర్ ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
హరిచందన్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్, సీనియర్ వైద్యుడు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో జగన్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
అంతకుముందు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చి తమిళిసై…హరిచందన్ ఆరోగ్య పరిస్ధితిని గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు మెరుగైన చికిత్స అందుతోందని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నానని తమిళిసై అన్నారు.
గవర్నర్ హరిచందన్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. గవర్నర్ కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అయితే, చాలాకాలం నుంచి గవర్నర్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న గవర్నర్ హరిచందన్…ఇటీవల కాస్త అస్వస్థతకు గురై వెంటనే కోలుకున్నారు.