ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన `సూపర్-6` హామీలపై తాజాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటికే సూపర్-6 పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్ఫూర్తిగా తీసుకుని.. ఎన్నికల మేని ఫెస్టోలో ప్రకటించిన పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. విడతల వారీగా వాటిని అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.
ఇప్పటికే మెగా డీఎస్సీ-2024ను ప్రకటించామని.. దీనిద్వారా సుమారు 16500 ఉపాధ్యాయ పోస్టులను తమ ప్రభుత్వం భర్తీ చేయనున్నదని తెలిపారు. అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000లకు పెంచామని.. దీనిని ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. అలాగే.. ఉచిత ఇసుక పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఇసుక కుంభకోణాలు.,. దోపిడీల కారణంగా రియల్ ఎస్టేట్ రంగంతోపాటు.. ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గవర్నర్ చెప్పారు.
5 రూపాయలకే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా పునః ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబం ధించిన కార్యాచరణను ఇప్పటికే పూర్తి చేసినట్టు గవర్నర్ వివరించారు. గత ప్రభుత్వం ఈ క్యాంటీన్లను పట్టించుకోకపోవడంతో పేదలు ఆకలితో మాడిపోయారని అన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో పేదలకు అన్నా క్యాంటీన్లు చేదోడు అవుతాయని.. వారి ఆకలి తీరుస్తాయని గవర్నర్ పేర్కొ న్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ క్యాంటీన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇతర పథకాలను కూడా.. త్వరలోనే అమలు చేయనున్నట్టు గవర్నర్ నజీర్ తెలిపారు. ప్రజల ఆదాయా న్ని రెట్టింపు చేయడంతోపాటు.. రాష్ట్ర సంపదను కూడా పెంచే దిశగా కార్యాచరణతో ముందుకు సాగుతు న్నామని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని.. వాటిని సరిదిద్దుకుంటూ.. మరోవైపు సంక్షేమాన్ని అమలు చేస్తూ.. ప్రభుత్వం శ్రమిస్తున్నట్టు చెప్పారు.