ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో తన మార్క్ చూపిస్తోన్న సంగతి తెలిసిందే. పంచాయతీ రాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలు ప్రపంచ రికార్డు నెలకొల్పాయి. ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డ్ సాధఇంచింది. తాజాగా వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఈ విషయాన్ని అధఇకారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ రికార్డు ధృవపత్రాన్ని పవన్ కల్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధులు అందజేశారు.
పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ రికార్డు సాధించిన పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు చెప్పారు.
ఆగస్ట్ 23న ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహణలో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు, ప్రతినిధులకు పవన్ అభినందనలు తెలిపారు. స్వపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి చేరుకోవడం హర్షణీయమని పవన్ అన్నారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో సోమవారం ఉదయం వరల్డ్ రికార్డు యూనియన్ అధికారులు ధృవపత్రాన్ని పవన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి కృష్ణతేజ కూడా ఉన్నారు.