వినేవాడుంటే..చెప్పేవారు చిరంజీవులవుతారని.. ఒక సామెత! ఇప్పుడు ఏపీలోనూ ఇదే వినిపిస్తోంది. దీనికి కారణం.. ఏపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత..ఏమేరకు హామీలను అమలు చేశామో.. లెక్కలు.. శాతాలు సహా.. గణాంకాలను వండివార్చింది. ప్రభుత్వంలో నెంబర్ 3గా ఉన్న మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ లెక్కలను బాగానే వివరించారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వెంటనే కరోనా వచ్చిందన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయ ని చెప్పారు. అయినప్పటికీ.. ధీరోదాత్తుడైన తమ ముఖ్యమంత్రి జగన్.. సాహసోపేత నిర్ణయాలు తీసుకు ని(అప్పులు విషయంలోనా అని నెటిజన్లు నవ్వుతున్నారు) అనేకపథకాలు ఆపకుండా.. అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో మంత్రివర్యులు లెక్కలు కూడా చెప్పారు.
ఇప్పటి వరకు అంటే.. 2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు కూడా తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం పూర్తి చేశామని.. శాతాలు.. అంకెల సహితంగా వివరించారు. ఇప్పుడు దీనిపైనే నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. అన్నీ అమలు చేస్తే.. సీపీఎస్ సంగతేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అన్నీ అమలైపోతే.. పోలవరం మాటేంటని.. అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు.
అంతేకాదు, అన్ని హామీలూ పూర్తయితే.. రాష్ట్రంలో జగనన్న కాలనీలు ఇంకా మొండి గోడలను, మరికొన్ని చోట్ల లే అవుట్ల ముగ్గులను కూడా దాటలేదెందుకని ఆ పథకంలో లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మంత్రి వర్యులు ఏం చెబుతారో చూడాలి. ఇక, అమలు చేయాల్సినవి ఏమీ లేవని అంటున్న మంత్రికి నెటజన్లు మరో ప్రశ్న కూడా సంధిస్తున్నారు. మరి ఇప్పుడు ఎన్నికలకు వెళ్లిపోతారా? అని!! దీఇకి వైసీపీ నేతలు ఏం చెబుతారో చూడాలి.