ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విమర్శిస్తున్నారన్న కారణంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సర్కార్ రాజద్రోహం కేసు పెట్టిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో పాటు‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’, ‘టీవీ 5’ చానళ్లపై కూడా రాజద్రోహం కేసు పెట్టిన విషయం విదితమే. అయిేత, పత్రికా స్వేచ్ఛను హరించేలా తమపై పెట్టిన అక్రమ కేసులు పెట్టారంటూ ఆ రెండు చానళ్లూ వేర్వేరుగా సుప్రీంను ఆశ్రయించాయి. దీంతో, ఈ కేసులో మీడియాపై దుందుడుకు చర్యలు వద్దని సుప్రీం కోర్టు కూడా గతంలో హెచ్చరించింది,
ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసుపై సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసిందని బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ లో సంచలన కథనం ప్రచురితమైంది. అందులో, ప్రభుత్వంపై కుట్ర చేశారంటూ రఘురామపై జగన్ సర్కార్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ న్యూస్ చానళ్లకు, రఘురామరాజుకు మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపించింది. రఘురామకు టీవీ5 చైర్మన్ పదిలక్షల యూరోలు (దాదాపు రూ.8.8 కోట్లు) బదిలీ చేసినట్లు తెలుస్తోందని ఆరోపించింది.
ఆ డబ్బులకు బదులుగా క్విడ్ ప్రో కో కింద.. రఘురామ రాజు తన పదవిని ఆయా న్యూస్ చానళ్లకు సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించింది. తమ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుందని, కానీ, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతించలేమని తెలిపింది. రఘురామ ప్రసంగాలు, ఇంటర్వ్యూలను పథకం ప్రకారం ప్రసారం చేశారని ఆరోపించింది.
న్యూస్ చానల్స్, టీడీపీ కీలక నేతలు, రఘురామ చర్చించుకున్న తర్వాతే ఆ ప్రసారాలు జరిగాయని ఆరోపించింది. అంతేకాదు, ఆ ప్రసంగాలు క్షేత్రస్థాయిలో హింసకు దారితీశాయని ఆరోపించింది. రఘురామ సెల్ ఫోన్ పై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, డేటా వివరాలను కోర్టు ముందు ఉంచినట్టు తెలిపింది. రఘురామ ప్రెస్ మీట్ల తర్వాత ఆయా మీడియా వ్యక్తులనుంచి ప్రశంసలు వచ్చాయని ఆరోపించిన. ఓ వర్గం ప్రజలు మరో వర్గంపైకి రెచ్చగొట్టే కుట్రలో రఘురామ, ఆ చానెళ్లు చురుగ్గా పాల్గొన్నాయని ఆరోపించింది.