ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. హైకోర్టు నిర్దేశించిన గడువు ముగుస్తున్నందున 190 పేజీలతో కూడిన అఫిడవిట్లో కొన్ని కీలకంశాలు వెల్లడయ్యాయి. ఓ రాజధాని నిర్మాణంపై నెల రోజుల గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సబబు కాదన్న ధోరణిలో వాదన వినిపించేందుకే ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసిందని తెలుస్తోంది.
హైకోర్టు విధించిన గడువులో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చేసింది. మౌలిక సదుపాయాల నిర్మాణాలకు సమయం పడుతుందని, 6 నెలల్లో ఆ నిర్మాణాలు పూర్తి కావని, 60 నెలల సమయం పడుతుందని కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ లో వెల్లడించింది. అమరావతి ప్రాంతం నుంచి నిర్మాణ కార్మికులు వెళ్లిపోయారని, వర్కర్లతో పాటు యంత్రాలను తిరిగి రప్పించేందుకే 2 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం చెప్పింది. పనులు మొదలుపెట్టేందుకు కనీసం 8 నెలల సమయం పడుతుందని వెల్లడించింది.
అమరావతి రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణానికి 16 నెలల సమయం పడుతుందని, డ్రైనేజీ, నీటి సరఫరా, ఇతర పనులకు 36 నెలల సమయం పడుతుందని ప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో రూ.42,231 కోట్లతో పనులు ప్రారంభించారని, ప్రస్తుతం నిధుల సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే గత నెల 23న సీఆర్డీఏ అధికారుల బృందం బ్యాంకర్లతో సమావేశమైందని, రుణాలు ఇచ్చే విషయంపై ఇంకా బ్యాంకులు స్పందించలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తాజా అఫిడవిట్ పై హైకోర్టు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.