ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఎపిసోడ్ టీవీ సీరియల్ ను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే, తాము ఎన్నికలను నిర్వహించలేమని, అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని సీఎస్ ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీంతో, ఏపీలో స్థానిక సంస్థల వ్యవహారానికి తెర పడినట్టే పడి మళ్లీ మరో మలుపు తిరిగిన్లయింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తాజాగా ఏ విధమైన ఆదేశాలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
జగన్ సర్కార్ కు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య కొద్ది నెలలుగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల నిర్వహణపై సీఎస్ ఆదిత్యనాథ్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్ఈసీకి రాసిన లేఖకు నిమ్మగడ్డ జవాబిచ్చారు. తన హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. అందుకే, పంచాయితీ ఎన్నికల వాయిదా కుదరదని సీఎస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఎన్నికలను బహిష్కరిస్తున్నామని సీఎస్ ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సంప్రదించాలని,ఈ విషయంలో ఎస్ఈసీదే తుది నిర్ణయం అఅని హైకోర్టు గతంలోనే చెప్పింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్చలు జరపకపోగా…నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఉద్యోగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వారికి శానిటైజర్, మాస్క్ లు సరఫరా చేయాలని, పోలింగ్ సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది.