ఈ ఏడాది ఆరంభంలో నవ్యాంధ్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్ బెంగళూరు వెళ్లారు. విశాఖలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని అక్కడి ఎక్స్‌పోలో ప్రకటించారు. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారించామన్నారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతోంది. యువతకైతే మండిపోతోంది కూడా. ఎందుకంటే జగన్ గద్దెనెక్కడం.. విశాఖలో ఐటీ రంగం ఒట్టిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. పాలనా రాజధాని పేరిట రాష్ట్రంలో ప్రాంతీయ చిచ్చు రేపిన జగన్ అండ్ కో.. విశాఖలో భూములన్నీ ఈ నాలుగున్నరేళ్లలో స్వాహా చేసేశారు. ప్రధానంగా ఐటీ రంగం కోసం నిర్మించిన భవనాల నుంచి కంపెనీలన్నీ తరిమేసి.. ఇప్పుడు పాలనా రాజధాని పేరుతో వాటిలో ప్రభుత్వ కార్యాలయాలను పెట్టాలని చూస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ పెట్టింది పేరైతే… రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఐటీ, ఫైనాన్స్ రంగాలకు కేంద్రంగా మలచాలని నాటి సీఎం చంద్రబాబు ఎంతో కృషిచేశారు. రుషికొండలో మూడు కొండలపై ఐటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. హిల్ నంబర్-1లో మిరాకిల్, ఫినెక్స్ కంపెనీలకు స్థలాలు కేటాయించారు. హిల్ నంబరు 2లో సుమారుగా 20 కంపెనీలకు స్థలాలు ఇచ్చారు. చంద్రబాబు హయాంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ, నగదు రహిత లావాదేవీల అభివృద్ధికి ‘ఫిన్‌టెక్ సిటీ’ ఏర్పాటుచేశారు. జగన్ రాగానే దానిని మూసేశారు. హిల్ నంబరు-3లో చంద్రబాబు హయాంలోనే స్టార్టప్ విలేజ్ ప్రారంభించి, ప్రోత్సహించారు.
జగన్ వారందరినీ ఖాళీ చేయించి తరిమివేశారు. చంద్రబాబు హయాంలోనే ఇక్కడ మిలీనియం టవర్-1 ప్రారంభమైంది. నాలుగంతస్థుల్లో అంతర్జాతీయ కంపెనీ కాండ్యుయెంట్ను ప్రారంభించారు. అదే ఆఖరు. ఆ తర్వాత మరో కంపెనీ వస్తే ఒట్టు. ఆ టవర్‌లో నాలుగు అంతస్థులు మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. అవి కూడా ఇస్తే మరో 500 మందికి ఉద్యోగాలు ఇస్తామని కాండ్యుయెంట్ ప్రతినిధులు చెప్పినా.. జగన్ సర్కారు ఇవ్వలేదు. ఆరు నెలల క్రితమే టవర్-2 కూడా పూర్తయింది. అందులో ఎనిమిది అంతస్థులు ఉన్నాయి. ఒక్కరికి కూడా దానిని కేటాయించలేదు. ఇది పూర్తిగా ఐటీ పార్కు కాగా అందులో రాష్ట్ర రాజధానికి సంబంధించిన కార్యాలయాలు పెట్టాలని ఖాళీగా ఉంచేశారు. అందులోనే ప్రీమియర్ రిజిస్ట్రేషన్ల పేరుతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయం పెట్టాలని నిర్ణయించారు.
రాయితీల ఊసేలేదు!
జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేదు. దీంతో ఈ రంగంలో కొత్తగా ఎవరూ పెట్టుబడులు పెట్టడం లేదు. బీపీవో కంపెనీల పాత్ర, డబ్ల్యూఎన్ఎస్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకుని కొత్త కార్యాలయాలు ప్రారంభిస్తే.. అది తమ ప్రతిభేనని ఐటీ మంత్రి అమర్నాథ్ చెప్పుకొన్నారు. నిజానికి అవి కూడా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల మేరకు విస్తరించినవే. టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ ఐటీ మంత్రిగా ఉండగా కాపులుప్పాడలో 250 ఎకరాల్లో కొండపై రూ.40 కోట్లతో ఐటీ లేఅవుట్ ఏర్పాటుచేశారు. అందులో 77 ఎకరాలు కంపెనీల కోసం కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన జగన్.. ఆ లేఅవుట్లో కనీసం గజం స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదు. ఇక్కడ ఇంత స్థలం ఉంచుకుని కొత్తగా భోగాపురంలో 90 ఎకరాల్లో ఐటీ పార్కు పెడుతున్నామని, అక్కడికి రావాలని చెబుతున్నారు. దీనిపై ఐటీ కంపెనీల ప్రతినిధులు విస్తుపోతున్నారు.
పాలసీ పెట్టినా సాయం శూన్యం
రాష్ట్రంలో స్టార్టప్ కల్చర్ మందగించిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో ఐటీ పాలసీలో ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్(ఎసాప్)’ పేరుతో కొత్త పథకం తీసుకువచ్చింది. వెంచర్ కేపిటలిస్టులతో రూ.100 కోట్లతో మూలధనం పెట్టుబడిగా పెట్టిస్తామని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు, యూనివర్సిటీలను అనుసంధానం చేస్తామని కూడా చెప్పింది. అయితే ఇది మాటలకే పరిమితమైంది. ఒక్క కొత్త స్టార్టప్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. ఇక, రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్’(పీఎంఏ) స్కీమ్‌ను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన ఐటీ పని ఏదైనా స్థానిక కంపెనీలకు ఇవ్వాలి. వీరు చేయలేని భారీ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని ఇతర ప్రాంతాల్లోని వారికి ఇచ్చుకోవచ్చు.
దీని కోసం ఒక పోర్టల్ పెట్టి ఐటీ కంపెనీల పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. జగన్ వచ్చాక 50కి పైగా ఐటీ సాఫ్ట్వేర్లు తీసుకొన్నారు. ఇసుక అమ్మకాలకు ఒక వెబ్సైట్ పెట్టారు. వార్డు వలంటీర్ల కోసం సాఫ్ట్వేర్ తీసుకున్నారు. పౌర సరఫరాల శాఖలో రేషన్ పంపిణీ కోసం, నెల నెలా మొదటి వారంలోనే పింఛన్ల పంపిణీ, ఇసుక అమ్మకాలు, మద్యం దుకాణాల నిర్వహణ.. ఇలా అనేక శాఖల్లో ఐటీ అవసరాల కోసం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌లు తీసుకున్నారు. ఈ పనుల కోసం ఎక్కడా ప్రకటనలు ఇవ్వలేదు. టెండర్లు ఆహ్వానించలేదు. పీఎంఏలో పేర్లు నమోదు చేసుకున్న వారికీ సమాచారం లేదు. తమకు నచ్చిన వారికి ఆ పనులు అప్పగించుకున్నారు. ఆపదలో ఉన్న మహిళల కోసం ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ యాప్‌ను కూడా భువనేశ్వర్‌లో ఉన్న కంపెనీకి అప్పగించారు.
2 కోట్లు కూడా లేవా?!
విశాఖ స్టీల్‌ప్లాంటులో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఆన్ ఇండసీ్ట్ర 4.0’ పేరుతో ఓ ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని వ్యయం రూ.20.32 కోట్లు కాగా, స్టీల్‌ప్లాంటు రూ.9 కోట్లు సమకూర్చింది. కేంద్ర ఐటీ శాఖ రూ.8.32 కోట్లు అందించింది. ఎస్టీపీఐ రూ.కోటి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఏడాదైనా రూపాయి కూడా ఇవ్వలేదు. ఐటీకి ఎలాంటి సాయం చేయకుండా పెట్టుబడిదారులను రమ్మంటే ఎందుకు వస్తారు? ఎవరు వస్తారని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.