ఏపీ జల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ సర్కారు ఆడుతున్న ఆట అంతా ఇంతా కాదనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికలకు ముందు.. 2020 సెప్టెంబరు నాటికి.. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. జగన్ హామీ ఇచ్చారు. ఇక, తర్వాత.. దానిని ఏటికేడు పెంచుతూ పోయా రు. అదిగో ఇదిగో.. వచ్చే ఏడాది వాటర్ ఇచ్చేస్తామంటూ.. అప్పటి జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అయితే.. ఇప్పటికీ అది పూర్తి కాలేదు.
అంతేకాదు.. తాజాగా మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం గుట్టు విప్పేశారు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడం కష్టమని.. చెప్పలేమని.. వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అంబటి.. పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాలు మాట్టాడుకుంటే.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది చెప్పలేమన్నారు. ఒక డేట్.. ఒక ఇయర్ నిర్దిష్టంగా చెప్పే అవకాశం లేదన్నారు. అయితే.. అదేసమయంలో దీనిని దశల వారీగా పూర్తి చేస్తామన్నారు.
`దేశంలోనే.. రాష్ట్రంలోనే.. పెద్ద స్పిల్ వే ఉన్న ప్రాజెక్టు ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే.. చెప్పలేం. ఇది వాస్తవం. అయితే.. దశల వారీగా మాత్రమే పూర్తవుతుందని.. చెప్పగలను. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కుడి కాలువను పూర్తిచేసింది. దీనిద్వారా పట్టిసీమకు నీళ్లు ఇచ్చి.. పలు జిల్లాలకు వాటర్ అందించింది. ఇది పెద్ద ప్రాజెక్టు.. ఒకే సారి మాత్రం పూర్తి కాదు.“ అని వివరించారు. గతంలో వైఎస్ రైట్ కెనాల్‌ను పూర్తి చేయాలని అనుకున్నారని అన్నారు. కానీ, చంద్రబాబు వచ్చా క పూర్తయిందన్నారు.
లెప్ట్ కెనాల్ కూడా పురుషోత్తమ పట్నం నుంచి పూర్తి చేయాలని భావించారని, కానీ.. కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయిందని చెప్పారు. అయితే.. దశల వారీగానే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కానీ, ఆ దశలు ఏంటనేది కూడా.. ఇప్పుడు చెప్పడం కుదరదన్నారు. ఏయే దశలు ఎప్పుడు పూర్తవుతాయనేది.. త్వరలోనే వెల్లడిస్తామని..వైట్ పేపర్ ఇస్తామని అంబటి వ్యాఖ్యానించారు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ అయితే లేదని కుండబద్దలు కొట్టేశారన్న మాట.