ఏపీలో కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు వ్యవహారంపై కొంతకాలంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే సీపీఎస్ ను రద్దు చేస్తామని నాటి ప్రతిపక్ష నేతగా నేటి సీఎం జగన్ ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చాలంటూ చాలాసార్లు ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స నేతృత్వంలోని మంత్రుల బృందం ఎన్నోసార్లు చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్న రీతిలో గత ఏడాది కాలంగా జరుగుతున్న సంగతి తెెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత సమ్మె చేయాలన్న ఆలోచనలో ఉన్న ఉద్యోగ సంఘాలు…అనుకోకుండా ఆ ఆలోచనలను విరమించుకున్నాయి. ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుండడంతోనే సమ్మెకు వారు వెళ్లలేదని తెలుస్తోంది. అయితే, ఇటీవల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.
ఇలా ప్రభుత్వంపై ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేసి ఘటన ఇదే చరిత్రలో తొలిసారి అని, అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరగడం దురదృష్టమని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. తమ డిమాండ్ల కోసం నిరసన వ్యక్తం చేయడానికి, ఆందోళన చేయడానికి అనుమతి దొరకని విపత్కర పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులు మరోసారి ఉద్యమ కార్యచరణ ప్రకటించడం సంచలనం రేపుతోంది.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని ఆ సంఘం నేతలు కలిసి నోటీసులు అందజేశారు. ఉద్యోగుల ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారానికి మార్చి 9 నుంచి ఉద్యమం చేయబోతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ నిరసనలు…ఆ తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇచ్చి ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాట పట్టబోతున్నారు. చాయ్ బిస్కట్ సమావేశాలతో రాజీపడే ప్రసక్తేలేదని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు.